వరంగల్ మేయర్‌పై కార్పొరేటర్ల గరం గరం.. పదవీ గండం

మేయర్ పై అవిశ్వాసానికి సిద్ధమైతే ఎవరి బలమెంతా..? అవిశ్వాసం పెడితే తగ్గేదెవరూ..? నెగ్గేదేవరూ..?

వరంగల్ మేయర్‌పై కార్పొరేటర్ల గరం గరం.. పదవీ గండం

WARANGAL MAYOR Gundu Sudha Rani

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు… శాశ్వత మిత్రులు ఉండరంటారు. ఎవరు ఎప్పుడు ఎవరితో చేతులు కలుపుతారో? ఎందుకు కలుస్తారో? ఎందుకు విడిపోతారో? తెలియని ఒక్క రాజకీయంలోనే… అందుకే శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరంటారు.

కానీ, ఓరుగల్లు రాజకీయంలో శత్రువు అంటే శత్రువే అంటున్నారు కారు పార్టీ వాళ్లు.. వీళ్లకి కమలం పార్టీ వారు జతకలిసి… హస్తం పార్టీలో చేరిన మేయర్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అంతేకాదు కాంగ్రెస్‌ కార్పొరేటర్లు ఈ రాజకీయంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారట… దీంతో మేయర్‌ సుధారాణి పదవికి గండం వచ్చే పరిస్థితి ఏర్పడిందంటున్నారు.

పార్లమెంట్ ఎన్నికలు ముగిసినా వరంగల్‌లో రాజకీయ వేడి చల్లారడం లేదు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌ మేయర్‌ గుండు సుధారాణిని ఆ పదవి నుంచి దించేయాలని పార్టీలకతీతంగా నేతలు వ్యూహాలు రచిస్తున్నారు.

హస్తం పార్టీలో చేరారని..
తమకు హ్యాండిచ్చి హస్తం పార్టీలో చేరారని బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు… తమకు దక్కాల్సిన మేయర్‌ పదవిలో సుధారాణి కూర్చున్నారని కాంగ్రెస్‌ కార్పొరేటర్లు…. అవకాశం వస్తే పై చేయి సాధించాలని బీజేపీ కార్పొరేటర్లు.. మేయర్‌కు వ్యతిరేకంగా రాజకీయం చేస్తున్నారు. అవిశ్వాసం పెట్టి సుధారాణి పదవిని లాగేయాలని ప్లాన్‌ చేస్తున్నట్లు పొలిటికల్‌ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది.

గ్రేటర్‌లో మొత్తం 66 డివిజన్లు ఉండగా, కాంగ్రెస్ పార్టీలోకి చేరిన కొత్త – పాత కార్పొరేటర్లతో కలుపుకుని ఆ పార్టీ బలం 34కు చేరింది. 10 మంది బీజేపీ, 22 మంది బీఆర్ఎస్ సభ్యులుగా కొనసాగుతున్నారు. బీఆర్ఎస్‌కు నలుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు. ప్రస్తుతం మేయర్‌ గుండు సుధారాణి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుండగా, బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు సమావేశమై అవిశ్వాస నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామంతో మేయర్ గుండు సుధారాణి ఆందోళనకు గురవుతున్నట్లు చర్చ జరుగుతోంది.

బీఆర్ఎస్ పార్టీ కసరత్తు
మేయర్ గుండు సుధారాణి పార్టీని వీడటంతో అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతలు, కార్పొరేటర్లు మేయర్ గుండు సుధారాణిని పదవి నుంచి తప్పించాలని, ఆమెకు వ్యతిరేకంగా అవిశ్వాసం ప్రవేశపెట్టాలని వ్యూహాలు రచిస్తున్నారట… వీరికి కొంతమంది కాంగ్రెస్‌ కార్పొరేటర్లు సహకరించే అవకాశం ఉందనే వార్తలే హాట్‌టాపిక్‌గా మారాయి. బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలు, కార్పొరేటర్లు ఇప్పటికే మేయర్‌పై అవిశ్వాసం ప్రవేశపెట్టే విషయంపై చర్చలు జరిపారు. కలిసివచ్చే పార్టీలు, ఇతర పార్టీల కార్పొరేటర్ల మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.

గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి 2021లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందారు. గులాబీ పార్టీ పెద్దల సహకారంతో అనూహ్యంగా మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. దీంతో మేయర్ పదవిని ఆశించిన మిగతా కార్పొరేటర్లంతా తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అప్పటినుంచి సుధారాణి తీరుపై గుర్రుగా ఉన్న బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు అవకాశం కోసం ఎదురుచూశారు.

అసెంబ్లీ ఎన్నికల తరువాత ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతవగా, కొంతమంది కార్పొరేటర్లు కూడా కండువాలు మార్చేశారు. బీఆర్ఎస్‌లో మేయర్ తీరు నచ్చక కొంతమంది కాంగ్రెస్‌లో చేరారు. దీంతో బలం తగ్గి మేయర్ సెల్ఫ్ డిఫెన్స్ లో పడ్డారు. కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లతో తన పదవికి గండం పొంచివుందనే ఆలోచనతో ఆమె కూడా హస్తం గూటికి చేరారు.

అయితే సుధారాణి చేరికను కాంగ్రెస్ లో చేరిన మిగతా కార్పొరేటర్లు వ్యతిరేకించినా, పార్లమెంట్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర పార్టీ పెద్దలు కార్పొరేటర్లకు బుజ్జగించి సర్దిచెప్పారట… ఇప్పుడు ఎన్నికలు ముగియడంతో వారంతా ఇప్పుడు అవిశ్వాస రాగానికి తాలం వేస్తున్నట్లు చెబుతున్నారు.

మొత్తంగా 66 మంది కార్పొరేటర్లు
గ్రేటర్ వరంగల్ లో మొత్తంగా 66 మంది కార్పొరేటర్లు ఉండగా, మేయర్ సుధారాణిని వ్యతిరేకిస్తున్న కార్పొరేటర్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు తోడు బీజేపీ కార్పొరేటర్లు కూడా మేయర్‌ను గద్దె దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐతే అవిశ్వాసం తీర్మానంపై పాలకవర్గంలో సగానికంటే ఎక్కువ మంది కార్పొరేటర్లు సంతకాలు చేయాల్సివుంటుంది. ప్రస్తుతం బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు సంఖ్యా బలం లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీలోని కొందరు కార్పొరేటర్లను సంప్రదిస్తున్నట్లు సమాచారం.

మేయర్ పై అవిశ్వాసానికి సిద్ధమైతే ఎవరి బలమెంతా..? అవిశ్వాసం పెడితే తగ్గేదెవరూ..? నెగ్గేదేవరూ..? అనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు సంపూర్ణ మద్దతు ఉంటే మేయర్ కుర్చీకి ఎలాంటి ముప్పు వాటిల్లదు. కానీ, ఇందుకు భిన్నమైన పరిస్థితులు ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నాయంటున్నారు. మేయర్‌పై 8 మంది కార్పొరేటర్లు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారని చెబుతున్నారు. బీఆర్‌ఎస్‌లో మేయర్‌ తీరు నచ్చని కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరినా… ఇక్కడా సమస్య తప్పడం లేదని అసంతృప్తితో ఉన్నారంటున్నారు. మేయర్ వ్యతిరేక వర్గమైన ఆ 8 మంది బీఆర్ఎస్ ప్రతిపాదించే అవిశ్వాసానికి మద్దతు తెలిపితే మేయర్ కుర్చీకి గండం తప్పేలా లేదంటున్నారు.

Also Read: గవర్నర్‌ను కలిసిన వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి