Hyderabad Metro: గుడ్‌న్యూస్.. మూడు వినూత్న మార్గాల్లో ఫ్యూచర్ సిటీకి మెట్రో పరుగులు.. 40 నిమిషాలే ప్రయాణం..
ఫ్యూచర్ సిటీకి మూడు వినూత్న మార్గాల్లో మెట్రో సేవలను అందించేందుకు అధికారులు ప్రణాళిక చేస్తున్నారు.

Hyderabad Metro
Hyderabad Metro: హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ల తరువాత నాలుగో పెద్ద నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఫ్యూచర్ సిటీని ప్రపంచ స్థాయి నగరాల్లో ఒకటిగా నిలిపే లక్ష్యంతో పర్యావరణ రహిత ‘గ్రీన్ సిటీ’గా రూపుదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఫ్యూచర్ సిటీకి మెట్రో సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు ప్రత్యేక దృష్టిసారించినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు.
Also Read: Driving Licence: ఇంట్లో నుంచి కాలు బయటపెట్టకుండా డ్రైవింగ్ లైసెన్స్.. ఎప్పటి నుంచి.. ఎలా అంటే..?
18కిలో మీటర్లు భూమిపై మెట్రో..
ఫ్యూచర్ సిటీకి మూడు వినూత్న మార్గాల్లో మెట్రో సేవలను అందించేందుకు అధికారులు ప్రణాళిక చేస్తున్నారు. అండర్ గ్రౌండ్, ఎలివేటెడ్, ఎట్ గ్రేడ్ మార్గాల్లో మెట్రో మార్గాలను నిర్మించనున్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధానంలో మెట్రోను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. రావిర్యాల్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి స్కిల్ యూనివర్శిటీ వరకు దాదాపు 18 కిలోమీటర్లు ఎట్ గ్రేడ్ (భూమి లెవల్) విధానంలో మెట్రో పరుగులు తీయనుంది. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్ పోర్టులో రెండు కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ మెట్రో ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఆ తరువాత ఆరు కిలో మీటర్లు ఎలివేటెడ్ కారిడార్ మెట్రో మార్గం ఉంటుంది. పెద్దగోల్కొండ నుంచి ఓఆర్ఆర్ వెంట తక్కువ ఎత్తులో 14 కిలో మీటర్లు ఎలివేటెడ్ కారిడార్ ను నిర్మించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
Also Read: Hyderabad metro: గుడ్‌న్యూస్.. హైదరాబాద్ నార్త్ సిటీ వైపు మెట్రో విస్తరణ.. రేవంత్ కీలక నిర్ణయం
40కిలో మీటర్లు 40 నిమిషాల్లో..
శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి 40 కిలో మీటర్లు దూరాన్ని కేవలం 40 నిమిషాల్లో చేరుకునేలా కారిడార్ ను రూపొందిస్తున్నారు. ఫ్యూచర్ సిటీని పొల్యూషన్ ఫ్రీ గ్రీన్ సిటీగా, అంతర్జాతీయ సిటీల సరసన చేర్చాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగా హైదరాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో రైల్ లిమిటెడ్, హెచ్ఎండీఏ, టీజీఐఐసీలతో కలిసి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మార్చి నెల చివరినాటికి ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్ డీపీఆర్ పూర్తిచేసి, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.