Lockdown Violation Cases : హైదరాబాద్‌లో ఒక్కరోజే 7వేలకు పైగా లాక్‌డౌన్ ఉల్లంఘన కేసులు

Lockdown Violation Cases : హైదరాబాద్‌లో ఒక్కరోజే 7వేలకు పైగా లాక్‌డౌన్ ఉల్లంఘన కేసులు

Lockdown Violation Cases

Updated On : May 28, 2021 / 12:46 PM IST

Lockdown Violation Cases : కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సడలింపులు ఇచ్చారు. ఆ సమయంలో మాత్రమే ప్రజలకు బయటకు వచ్చి నిత్యావసరాలు కొనుగోలు చేయాలి. ఆ తర్వాత ఇంటికే పరిమితం అవ్వాలి. ఉదయం 10 నుంచి తర్వాతి రోజు ఉదయం 6 గంటల వరకు అంటే 20గంటల పాటు లాక్ డౌన్ అమల్లో ఉంటుంది.

అకారణంగా ఎవరూ బయటకు రాకూడదు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో హైదరాబాద్ పోలీసులు లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే అస్సలు ఊరుకోవడం లేదు. ఉల్లంఘనుల తాట తీస్తున్నారు. వాహనాలు సీజ్ చేయడమే కాదు కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం(మే 27,2021) ఒక్కరోజే నగరవ్యాప్తంగా 7వేలకు పైగా లాక్ డౌన్ ఉల్లంఘన కేసులు నమోదవడం గమనార్హం.

లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి గురువారం నగరవ్యాప్తంగా మొత్తం 7వేల 465 కేసులు నమోదైనట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. ఆయా మండలాల పరిధిలో లా అండ్‌ ఆర్డర్‌, ట్రాఫిక్‌ పోలీసులు నమోదు చేసిన కేసుల గణాంకాలను ఆయన విడుదల చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో అకారణంగా బయటకు వచ్చిన 5వేల 894, మాస్కు ధరించని 1197, భౌతిక దూరం పాటించని 332, ఇతరులు 42 మందిపై కేసులు నమోదయ్యాయి. 3వేల 326 వాహనాలు సీజ్‌ చేశారు.

సికింద్రాబాద్ వెస్లీ కాలేజ్ దగ్గర ఏర్పాటు చేసిన పోలీసు త‌నిఖీ కేంద్రాన్ని న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్ అంజ‌నీ కుమార్ ప‌రిశీలించారు. ప్ర‌తి త‌నిఖీ కేంద్రం దగ్గర పోలీసులు ప‌క‌డ్బందీగా విధులు నిర్వ‌హిస్తున్నార‌ని తెలిపారు. ప్ర‌తీ రోజు 8 వేల‌కు పైగా లాక్‌డౌన్ ఉల్లంఘ‌న కేసులు న‌మోదు అవుతున్నాయ‌ని చెప్పారు. 5 నుంచి 6 వేల వ‌ర‌కు వాహ‌నాలు సీజ్ అవుతున్నాయ‌ని వెల్లడించారు. ఈ-పాసులు దుర్వినియోగం చేస్తున్న వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.