హైడ్రాకు హైపవర్..! ఆ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం..
అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో ప్రభుత్వానికి ప్రధాన అడ్డంకి తొలగిందని చెప్పొచ్చు.

Hydra Demolishing (Photo Credit : Google)
Hydra : హైడ్రా ఆర్డినెన్స్ కు తెలంగాణ గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తూ ఆర్డినెన్స్ పై గవర్నర్ సంతకం చేశారు. హైడ్రా ఆర్డినెన్స్ అన్నది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైన అంశం. దీనిపై గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సంతకం చేశారు. ఇక్కడి నుంచి హైడ్రాకు పూర్తి స్థాయిలో చట్టబద్ధత కలగనుంది. దీంతో ఇన్ని రోజులుగా హైడ్రా కూల్చివేతలకు సంబంధించి ప్రధానంగా ప్రతిపక్షాలన్నీ కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఎలాంటి చట్టబద్ధత లేని హైడ్రా.. ఏ విధంగా కూల్చివేతలు చేస్తుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాజాగా గవర్నర్ ఆమోద ముద్రతో హైడ్రాకు చట్టబద్ధత కల్పించినట్లైంది. ఇదొక కీలక నిర్ణయంగా అభివర్ణించవచ్చు.
సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ కీలక డెసిషన్ తీసుకుంది. జీవో 99 ద్వారా హైడ్రాను తీసుకొచ్చింది ప్రభుత్వం. అయితే, దీనిపై చాలామంది వ్యక్తులు, సంస్థలు కోర్టును ఆశ్రయించారు. జీవో 99 ద్వారా తీసుకొచ్చిన హైడ్రాకు.. నిర్మాణాలను కూల్చే హక్కు, చట్టబద్ధత లేదంటూ కోర్టులో సవాల్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదంతో హైడ్రాకు పూర్తి స్థాయిలో చట్టబద్ధత వచ్చింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో ప్రభుత్వానికి ప్రధాన అడ్డంకి తొలగిందని చెప్పొచ్చు.
చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించి చెరువుల పరిరక్షణ లక్ష్యంగా రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసిన సంస్థ హైడ్రా. అయితే, కేవలం జీవో 99 ఆధారంగా తీసుకొచ్చిన హైడ్రాకు ఎలాంటి చట్టబద్ధత లేదని, నిర్మాణాలను ఎలా కూలుస్తారని ప్రశ్నిస్తున్నారు. ఏవైనా నిర్మాణాలను కూల్చాలంటే మూడు నాలుగు విభాగాల నుంచి అనుమతులు తప్పనిసరి. చెరువుల్లో ఒక నిర్మాణం జరగాలంటే దానికి ఇరిగేషన్ శాఖ నుంచి ఎన్ ఓసీ ఇవ్వాల్సి ఉంటుంది. అదే విధంగా లే ఔట్స్ కి సంబంధించి అనుమతి తీసుకోవాలి. ఇక రిజిస్ట్రేషన్ కు సంబంధించి సంబంధిత శాఖ నుంచి పర్మిషన్ తీసుకోవాలి.
ఇలా నాలుగైదు డిపార్ట్ మెంట్లతో ముడిపడిన అంశంలో హైడ్రా ఏకపక్షంగా ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటుందని, కూల్చివేతలు చేస్తుందని ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. అటు న్యాయస్థానాలు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించాయి. చట్టబద్ధత లేనప్పుడు నిర్మాణాలు ఎలా కూలుస్తారని హైకోర్టు కూడా ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే వీటిని దృష్టిలో ఉంచుకుని హైడ్రాకు ఒక చట్టబద్ధత తేవాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంది. ఆర్డినెస్ తీసుకురావడం, దానికి గవర్నర్ ఆమోద ముద్ర వేయడం జరిగిపోయాయి.
Also Read : హైదరాబాద్‌లో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు..! అండర్ గ్రౌండ్ టన్నెల్స్ నిర్మాణానికి ప్రభుత్వం రెడీ..