హైదరాబాద్‌లో భారీగా కూల్చివేతలు.. అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం

భారీ యంత్రంతో కూల్చివేతలను కంటిన్యూ చేస్తున్నారు. మూడు భవనాల్లో ఒకటి పూర్తిగా నేలమట్టం కాగా రెండో భవనాన్ని కూల్చేస్తున్నారు.

హైదరాబాద్‌లో భారీగా కూల్చివేతలు.. అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం

Updated On : August 11, 2024 / 4:53 PM IST

HYDRA : హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో హైడ్రా ఆధ్వర్యంలో నగరంలో అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్నారు అధికారులు. ఇందులో భాగంగా చందానగర్ సర్కిల్ హఫీజ్ పేట్ డివిజన్ వైశాలి నగర్ లో ఎఫ్ టీఎల్ ల్యాండ్ లో అక్రమంగా నిర్మిస్తున్న 3 భవనాలను హైడ్రా అధికారులు గుర్తించారు.

శనివారం ఉదయం ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేతలను అధికారులు మొదలు పెట్టారు. అర్థరాత్రి వరకు కూల్చివేతలను కొనసాగించింది. ఆ తర్వాత ఉదయం భారీ యంత్రంతో కూల్చివేతలను కంటిన్యూ చేస్తున్నారు. మూడు భవనాల్లో ఒకటి పూర్తిగా నేలమట్టం కాగా రెండో భవనాన్ని భారీ యంత్రంతో అధికారులు కూల్చేస్తున్నారు.

హైదరాబాద్ నగరంలో ఉన్న అక్రమ కట్టడాలపై చాలా రోజుల తర్వాత అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. 2015 అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూడా ఇదే రీలిలో కూల్చారు. ఇప్పుడు కూడా అదే విధంగా చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించి వెలసిన అక్రమ కట్టడాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. చాలా కాలం నుంచి వీటిపై ఫిర్యాదులు ఉన్నాయి. అయినా క్షేత్రస్థాయిలో అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం అక్రమ నిర్మాణాలపై దృష్టి పెట్టింది. అలాగే ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వానికి సంబంధించిన చెరువులు, నాలాలు, పార్క్ లు, ఓపెన్ ల్యాండ్స్ ను ఎవరైనా కబ్జా చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇదే క్రమంలో అక్రమ కట్టడాలను గుర్తించి కూల్చేస్తున్నారు.

కూకట్ పల్లి, చందానగర్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో ఉండే చెరువులు.. ఓల్డ్ సిటీ, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో ఉండే చెరువులు, నాలాలపై పెద్ద మొత్తంలో అక్రమ నిర్మాణాలు వెలిశాయి అనే ఫిర్యాదులు ఉన్నాయి. ఒక్కో ఫిర్యాదును పరిశీలిస్తున్న ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఇప్పటివరకు దాదాపు 200 ఫిర్యాదులు అందినట్లు సమాచారం. వీటన్నింటిపై అధికారులు దృష్టి పెట్టారు. రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ అధికారులతో రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు. వాటి ఆధారంగా అక్రమ కట్టడాలు కట్టిన వారికి నోటీసులు ఇస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వానికి సంబంధించిన ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు కడితే ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా ఆ నిర్మాణాలను కూల్చే అధికారం అధికారులకు ఉంది. అందులో భాగంగానే హైడ్రా ముందుకు సాగుతోంది. భారీ యంత్రాల సాయంతో పక్క భవనాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అక్రమ కట్టడాలను అధికారులు కూల్చేస్తున్నారు.

ఒకేసారి భవనం కుప్పకూలేలా ఈ భారీ యంత్రం ఉపయోగపడుతుందని అధికారులు వివరించారు. అక్కడ మళ్లీ నిర్మాణం చేసేందుకు పనికి రాకుండా చేయొచ్చని చెప్పారు. మరోవైపు ప్రజలను కూడా హెచ్చరించారు అధికారులు. తక్కువ ధరకు ఇళ్లు అమ్ముతున్నారని ఇలాంటి అక్రమ కట్టడాలను కొనుగోలు చేస్తే పూర్తి స్థాయిలో నష్టపోవాల్సి వస్తుందని, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరించారు. తక్కువ ధరకు ఇల్లు కానీ స్థలం కానీ వస్తుందని ఆశపడి కొనుగోలు చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.

హైదరాబాద్ నగరంలో గడిచిన 45 ఏళ్లలో దాదాపు 61శాతం వరకు చెరువులు కబ్జా అయిపోయాయి. ఇదే విధంగా కబ్జాలు కొనసాగితే నగరంలో నీటి వనరులకు ముప్పు వస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో అలర్ట్ అయిన ప్రభుత్వం అక్రమ కట్టడాలపై ఫోకస్ పెట్టింది.

 

Also Read : విలీన ప్రచారం అబద్ధమని చెప్పుకోడానికి ఇరుపార్టీల నేతల తంటా