BRS-BJP: విలీన ప్రచారం అబద్ధమని చెప్పుకోడానికి ఇరుపార్టీల నేతల తంటా
బీజేపీ 8 సీట్లకు పరిమితమవగా, బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవాల్సివచ్చింది. ఇప్పుడు..
వాళ్లిద్దరూ ఒక్కటే.. అందుకే కవిత అరెస్టు కాలేదు… ఇది అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రచారం…. వాళ్లిద్దరూ ఒక్కటి కాదని చెప్పుకోడానికే కవిత అరెస్టు… ఇదీ పార్లమెంట్ ఎన్నికల ముందు చెప్పిన మాటలు… కవిత బెయిల్ కోసం బిజేపీలో బిఆర్ఎస్ విలీనం కాబోతోంది.. నేడో రేపో కవితకు బెయిల్ వచ్చేస్తుందంటూ ఇప్పుడు టాక్… కవితకు బెయిల్ ఎప్పుడైనా రావొచ్చు… కానీ, కవిత బెయిల్ అంశమే ఆ రెండు పార్టీలనూ ఉలికిపాటుకు గురిచేస్తోంది.. అధికార కాంగ్రెస్ వ్యూహామో.
సోషల్ మీడియా ట్రోలర్స్ దెబ్బోగానీ, తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు రెండు విలీన ప్రచారంతో ఉక్కబోత అనుభవిస్తున్నాయి….. మాకు.. మాకూ ఏ సంబంధం లేదు నమ్మండి మహాప్రభో అంటూ చెప్పుకోవడానికి నానాపాట్లూ పడుతున్నాయి…. ఇంతకీ విలీన ప్రచారం ఎందుకు జరుగుతోంది…ఈ ప్రచారంలో వాస్తవమెంత… ఈ ప్రచారంతో మునిగేదెవరు…తేలేదెవరు….?
నిజం గడపదాటేలోపు… అబద్ధం ఊరంతా తిరిగొస్తుందంటా…. ఈ సామెత ఎవరు చెప్పారోగానీ… రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఇప్పుడు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమట…. అంటూ సోషల్ మీడియాలో మొదలైన ప్రచారం అబద్ధమని చెప్పుకోడానికి ఇరుపార్టీల నేతలు నానా తంటాలు పడుతున్నారు.
తప్పుడు ప్రచారం అంటూ
తప్పుడు ప్రచారం చేసిన వారిని కోర్టుకు ఈడుస్తామని బీఆర్ఎస్ హెచ్చరిస్తుంటే… అసలు అలాంటి ఊసేలేదంటూ బీజేపీ నేతలు మొత్తు కొంటున్నారు. ఇదే సమయంలో ఈ ప్రచారానికి మరింత మసాలా దట్టిస్తూ కాంగ్రెస్ నేతలు పండగ చేసుకుంటున్నారు.
ఎవరు పుట్టించారో… ఎందుకు పుట్టించారో… ఏం ఆశిస్తున్నారో… కానీ, బీజేపీలో బీఆర్ఎస్ విలీనమనే ప్రచారం రెండు పార్టీలకు ఇబ్బందికరంగా మారిందంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షంగా రెండు పార్టీలూ చేతులు కలిపి ప్రభుత్వంపై పోరాడటానికి కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు. రాజకీయ వ్యూహాలు రచించడంలో అపర చాణుక్యుడిగా పేరు తెచ్చుకున్న మాజీ సీఎం కేసీఆర్‌కే ఇలాంటి సంకట స్థితి ఎదురుకావడం…. ఈ క్లిష్ట పరిస్థితి నుంచి ఆయన ఎలా బయటపడతారనేది ఆసక్తి పుట్టిస్తోంది.
వాస్తవానికి బీజేపీలో బీఆర్ఎస్ విలీనమన్న ప్రస్తావన రెండు పార్టీల నేతలు అసలు ఊహించలేకపోతున్నారు. నిజమో అబద్ధమో తేలకపోయినా.. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో వెళ్లాలనే ప్రయత్నం బిఆర్ఎస్ చేసిందనే టాక్ నడిచింది. అదప్పుడు పట్టాలెక్కలేదు. అయితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పూర్తిగా డీలా పడిపోవడంతో ఇక విలీన ప్రచారం జోరందుకుంది. ఆ దిశగా రెండు వైపుల నుంచి ఎలాంటి కదలిక లేకపోయినా, అసలు అలాంటి అవసరం ఇప్పుడు రెండు పార్టీలకూ ఏ మాత్రం లేకపోయినా…. ఈ ప్రచారానికి ప్రభుత్వ పెద్దలు ఎక్కువ ప్రాధాన్యమివ్వడం ఆసక్తికరంగా మారింది.
అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్, బీజేపీ మధ్య సత్సంబంధాలు ఉన్నాయనే ప్రచారంతోనే రెండు పార్టీలూ నష్టపోయాయనే విశ్లేషణలు ఉన్నాయి. ఆ తర్వాత రెండు పార్టీలు పొత్తులు కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయనే ప్రచారంతో లోక్ సభ ఎన్నికల్లో కారుకు గండి పడింది. ఇక ఇప్పుడు ఆ రెండు పార్టీలూ కలిసిపోనున్నాయనే ప్రచారంతో బీజేపీ, బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత అరెస్టు చుట్టూ ఈ ప్రచారాన్ని తిప్పుతుండటం వల్ల… ప్రజల్లో సందేహాలు రేపుతోంది అధికార కాంగ్రెస్.
పెద్దల ఆశీస్సులు
అసెంబ్లీ ఎన్నికలకు ముందు లిక్కర్ స్కాంలో కవిత అరెస్టు కాకపోవడానికి ఢిల్లీ బీజేపీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయని…. బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటే అన్న ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది కాంగ్రెస్. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో పదేపదే ఇదే అంశాన్ని ప్రచారం చేయడంతో బీజేపీ-కాంగ్రెస్ మధ్య చీలాల్సిన ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తగా కాంగ్రెస్‌కు మళ్లిపోయిందంటున్నారు.
దీంతో బీజేపీ 8 సీట్లకు పరిమితమవగా, బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవాల్సివచ్చింది. అంతవరకు రెండు పార్టీలూ ఓట్లు చీల్చితే తాను లాభపడతానని ఆశించిన గులాబీ బాస్ కేసీఆర్…. కాంగ్రెస్ వ్యూహం తేరుకోలేని దెబ్బతీసింది. ఇక పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా ఇదే తరహా ప్రచారం బీఆర్ఎస్‌ను ఒక్కసీటు గెలుచుకోకుండా చేసింది. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటి కాదని చెప్పుకోడానికే కవితను అరెస్టు చేశారని, ఎన్నికలయ్యాక కవితకు బెయిల్ వచ్చేస్తుందని ప్రచారం చేసింది కాంగ్రెస్. దీంతో బీఆర్ఎస్ మద్దతుదారులు బీజేపీకి మళ్లిపోయారు. దీంతో 2019లో 4 సీట్లు గెల్చుకున్న బీజేపీ…. 8 సీట్లకు తన బలాన్ని పెంచుకుంది. కాంగ్రెస్ కూడా 8 సీట్లతో సేఫ్‌గా నిలిచింది.
ఇక ఇప్పుడు బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటూ జరుగుతున్న ప్రచారం కూడా వ్యూహాత్మకమే అంటున్నారు. ఆ రెండు పార్టీలను కలవకుండా చూడటం ఒక ఎత్తైతే…. రెండు పార్టీలు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా రాజకీయంగా ఇరికించడం రెండో వ్యూహమంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే… రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలపై కలిసికట్టుగా పోరాడాల్సిన ప్రతిపక్ష పార్టీల నేతలు…. తమ మధ్య సంబంధాలు లేవని చెప్పుకోడానికే ఎక్కువ ప్రాధాన్యమివ్వాల్సివస్తోందంటున్నారు.
మొత్తానికి ఎవరు పన్నిన వ్యూహమోగానీ, ప్రస్తుతానికి బీజేపీ, బీఆర్ఎస్ నేతలు విలీనం అన్న మాట వింటేనే ఉలిక్కిపడుతున్నారు. ఇదే సమయంలో ఈ అంశాన్ని పెద్ద ఎత్తున జనంలోకి తీసుకెళ్తూ ఇరుపార్టీలను ఇరుకున పెడుతోంది అధికార కాంగ్రెస్. ఈ మైండ్ గేమ్ నుంచి బీఆర్ఎస్ ఎలా బయట పడుతుందో చూడాలి మరి.