RS Praveen Kumar : అధికారంలోకి వస్తే.. 10 లక్షల ఉద్యోగాలిస్తాం, ఆంధ్ర ప్రాంత వలసవాదులను ఓడించాలి- ఆర్ఎప్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar : రూ.2 వేలకు, బిర్యానీలకు ఓటు అమ్ముకుంటే.. మన భూములను పోగొట్టుకుంటాం అని ఓటర్లను హెచ్చరించారు ప్రవీణ్ కుమార్.

RS Praveen Kumar (Photo : Twitter)
RS Praveen Kumar – BSP : తెలంగాణలో బీఎస్పీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలిస్తామని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హామీ ఇచ్చారు. కొమురంభీం జిల్లా బెజ్జూర్ లో రోడ్ షో లో ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో దోపిడీ ఆగుతుందంటే నేను ఇక్కడి నుండే పోటీ చేస్తాను అని ఆయన అన్నారు. ఇక్కడి ప్రజల కోరిక మేరకు సిర్పూర్-టి లో పోటీ చేసే విషయాన్ని మాయావతిని అడుగుతాను అన్నారు. బాసరలో IIIT లో ఇద్దరు పిల్లలు ఎలా చనిపోయారో బహిర్గతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం నియోజకవర్గం నుండి ఒక అమ్మాయి చనిపోతే సమాధానం చెప్పేవారే లేరన్నారు.
పవిత్రమైన ఓటు హక్కును రూ.2 వేలకు, బిర్యానీలకు అమ్ముకుంటే.. మన భూములను పోగొట్టుకుంటాం అని ఓటర్లను హెచ్చరించారు ప్రవీణ్ కుమార్. ఆదివాసీ మహిళలను వేధించిన డబ్బా గ్రామ సర్పంచ్ కుమారుడు రషీద్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదు అని ఆయన నిలదీశారు. ఆదివాసీలను దూషించిన రషీద్ ను వెంటనే అరెస్ట్ చేయాలని, లేదంటే పీఎస్ ముందు కూర్చోని ధర్నా చేస్తామని హెచ్చరించారు.
ఎమ్మెల్యే కోనప్ప దౌర్జన్యాలకు భయపడి స్థానికులు ఇతర గ్రామాలకు, పట్టణాలకు వలస వెళ్తున్నారని ప్రవీణ్ కుమార్ వాపోయారు. సిర్పూర్ ప్రాంతం అభివృద్ధి కావాలంటే ఆంధ్ర ప్రాంత వలస వాదులను ఓడగొట్టాలని ఓటర్లు పిలుపునిచ్చారు.
” బహుజన రాజ్యం రావాలంటే బీఎస్పీని గెలిపించాలి. అభివృద్ధి చేసి చూపించకుంటే బెజ్జూర్ మత్తడివాగులో నన్ను బొందపెట్టండి. పోడు భూములకు పట్టాలు రావాలంటే బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి రావాలి. బీఎస్పీ అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలిస్తాం. రాష్ట్రం ఏర్పడ్డాక రూ.82వేల కోట్ల కాంట్రాక్టు పనులను ఆంధ్ర వాళ్ళకు ఇచ్చిన ఘనుడు కేసీఆర్” అని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.