Heatwave: భగ్గుమంటున్న భానుడు.. మూడు నెలలు మంటలే.. ఐఎండీ హెచ్చరికలు
ఏప్రిల్ నెలతోపాటు మే, జూన్ నెలల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, వడగాల్పుల తీవ్రతకూడా ఈసారి ఎక్కువగానే ఉంటుందని ఐఎండీ పేర్కొంది.

High temperatures
Heatwave: వేసవి ప్రారంభంలోనే ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. ఉదయం 10గంటల తరువాత బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. వాతావరణ మార్పుల కారణంగా రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు వేడి గాలుల ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) కీలక విషయాలను చెప్పింది. ఏప్రిల్ నుంచి జూన్ నెల వరకు మూడు నెలలపాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఐఎండీ అంచనా వేస్తోంది.
భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో వచ్చే మూడు నెలలు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, వడగాల్పుల తీవ్రతకూడా ఈసారి ఎక్కువగానే ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. మధ్య, తూర్పు ప్రాంతాల్లో, వాయవ్య రాష్ట్రాల్లో ఎక్కువ రోజులు వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఎక్కువ ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించి నమోదవుతాయని, కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా పలు చోట్ల సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని ఐఎండీ పేర్కొంది.
Also Read: Living Grave : ప్రకాశం జిల్లాలో కలకలం.. సజీవ సమాధికి వ్యక్తి యత్నం… ఎందుకిలా చేశాడంటే..
ఏప్రిల్, మే, జూన్ నెలల్లో అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే రెండు నుంచి నాలుగు రోజులు ఎక్కువగా వడగాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, రాజస్థాన్, యూపీ, హరియాణా, బిహార్, ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువగా వడగాల్పుల రోజులు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో దేశంలో చాలా ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ హెచ్చరించింది.