PM Modi: నిన్న బెంగాల్ లో.. నెక్ట్స్ తెలంగాణలోనే.. బీజేపీ సర్కార్ ఖాయం- ప్రధాని మోదీ
కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారన్న మోదీ.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
PM Modi: తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అని ప్రధాని మోదీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సర్కార్ ఖాయం అని జోస్యం చెప్పారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ బహిరంగ సభలో మాట్లాడారు. తెలుగులో స్పీచ్ ప్రారంభించారు మోదీ. నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా, మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ప్రసంగం మొదలు పెట్టారాయన. బెంగాల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం తాలూకా ఆనందం తెలంగాణలోనూ కనిపిస్తోందన్నారు. అబ్ కీ బార్ తెలంగాణలోనూ బీజేపీ సర్కార్ అని నినదించారు.
ఒకప్పుడు కనీసం బీజేపీ జెండా ఎగరేసే వాళ్లు కూడా లేని రాష్ట్రాల్లో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. బీజేపీకి దేశంలో రెండు ఎంపీలే ఉన్నప్పుడు అందులో ఒకరు తెలంగాణ నుంచే ఉన్నారని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభంజనం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారన్న మోదీ. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధిలో తెలంగాణ పాత్ర కూడా కీలకమైందన్నారాయన. దేశంలో మూడు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ సీఎంలు ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ ది ఒకటే మోడల్.. ముందు అబద్ధాలు చెప్పు.. తర్వాత మర్చిపో అని విమర్శించారు. ఆకాశంలో నక్షత్రాలు తెచ్చిస్తామని హామీలు ఇస్తారని ధ్వజమెత్తారు. కర్ణాటక, హిమాచల్ లో కాంగ్రెస్ హామీలు మర్చిపోయిందన్నారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మర్చిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ మావోల కన్నా పెద్ద మావోలు, ముస్లిం లీగ్ కన్నా ముస్లింలుగా మారిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ కి కొత్త పేరు పెట్టారు మోదీ. ముస్లిం లీగ్ మావో వాదీ కాంగ్రెస్ అని పేరు పెట్టారు.
