Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్లకు అర్హుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం.. రీవెరిఫికేషన్ కోసం ఏం చేస్తున్నారంటే?
ఎల్-1 లిస్టులో ఉండాల్సిన తమ పేర్లను ఎల్-2, ఎల్-3లో చేర్చినట్లు కొందరి నుంచి ఫిర్యాదులు వచ్చాయి.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో పేదలకు మొదట 7,000 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి విడతలో 3,500 ఇళ్లను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో తాజాగా ఇందిరమ్మ ఇళ్లకు అర్హులను ఎంపిక చేయడం కోసం గ్రామాల్లో రీవెరిఫికేషన్ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు.
తొలి విడతలో ఇప్పటికే 72,045 మందికి అధికారులు ఇళ్లను మంజూరు చేశారు. ఇప్పటికే అర్హుల లిస్టు ప్రకటించిన గ్రామాలను మినహాయించి అధికారులు ఆయా మండలాల్లోని మిగతా పల్లెల్లో అర్హుల ఎంపికపై దృష్టి సారించారు.
ఎల్-1 లిస్టులో ఉండాల్సిన తమ పేర్లను ఎల్-2, ఎల్-3లో చేర్చినట్లు కొందరి నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఇటువంటి వాటిపై కూడా అధికారులు దృష్టిపెట్టారు. ఈ ఫిర్యాదులపై కూడా సిబ్బంది రీవెరిఫికేషన్ చేస్తున్నారు.
L1 స్టేటస్‌లో ఉన్న 21.93 లక్షల మంది దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి రీవెరిఫెకేషన్ నిర్వహిస్తున్నారు. పేదలను లేక నిజమైన అర్హులను గుర్తించడానికి ఒక్కో మండలానికి నాలుగైదు బృందాలను ఏర్పాటు చేశారు అధికారులు. L1 స్టేటస్ లో ఉన్న వారే కాకుండా L2, L3 జాబితా కూడా రీవెరిఫికేషన్ చేస్తున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజులకే గ్రామ సభలు నిర్వహించి ఆరు గ్యారెంటీల కోసం ప్రజా పాలన దరఖాస్తులను ప్రజల నుంచి స్వీకరించింది. జనవరి 26న రాష్ట్రంలో మండలానికి ఒక గ్రామం చొప్పున మొత్తం 562 పంచాయతీల్లో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించి, ప్రజాపాలన గ్రామ సభల్లో అప్లై చేసుకున్న దరఖాస్తుల నుంచి అర్హులను గుర్తించి 72,045 మందితో ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితాను ఆరోజునే ప్రజల ముందే వెల్లడించారు అధికారులు.
ఇప్పుడు అర్హుల జాబితా ప్రకటించిన గ్రామాలను మినహాయించి మిగిలిన మండలాల్లోని గ్రామాల్లో ఇండ్ల కోసం అప్లై చేసుకున్న వారిలో అర్హుల ఎంపికపై దృష్టి సారించారు అధికారులు. ఇంతకుముందే చెప్పినట్లు ఆరు గ్యారెంటీల కోసం ప్రజాపాలన దరఖాస్తులో ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎవరైతే అప్లై చేశారో వాళ్ల వివరాలను వెంటనే మండల స్థాయి అధికారులు ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి పూర్తి వివరాలు నమోదు చేశారు.
కొన్ని వారాల క్రితం దరఖాస్తుదారుల ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్నపుడు వారి స్టేటస్‌ను తెలుసుకుని కింది విధంగా విభజించారు.
1) L1 – సొంతగా భూమి కలిగి ఉండి, ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న వారు
2) L2 – సొంత భూమి, ఇల్లు రెండు లేని వారు
3) L3 – ఇతరులు
సర్వే చేసిన ఆ గ్రామాల ఆ వివరాలు మండల పరిధిలో ఎంపీడీవో, పురపాలిక పరిధిలో కమిషనర్లకు చేరవేశారు అధికారులు.