ఆసక్తికరంగా నాగార్జునసాగర్ రాజకీయాలు : సిట్టింగ్ స్థానం నిలబెట్టుకునేందుకు టీఆర్ఎస్ వ్యూహాలు

Interesting Nagarjunasagar politics : నాగార్జునసాగర్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. నోముల నర్సింహయ్య మృతితో అనివార్యమైన ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్‌కే అన్ని పార్టీలు మొగ్గు చూపుతున్నాయి. సిట్టింగ్ స్థానం నిలబెట్టుకునేందుకు టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యంగా మాజీ మంత్రి, సీనియర్ నేత జానారెడ్డి చుట్టూనే సాగర్ రాజకీయం తిరుగుతోంది.
జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డిపై టీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. రఘువీర్‌రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు చర్యలు చేపట్టింది. అలాగే కాంగ్రెస్‌కు చెందిన మరో కీలక ప్రజాప్రతినిధితోనూ టీఆర్ఎస్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సాగర్ ఎన్నికల్లోపే రఘువీర్‌రెడ్డితో పాటు కీలక నేతను పార్టీలో చేర్చుకునే వ్యూహంలో గులాబీ నేతలు ఉన్నారు.
అటు మొన్నటి వరకు రఘువీర్ తమతో టచ్‌లో ఉన్నాడని బీజేపీ ప్రకటించగా… ఆ ప్రచారాన్ని జానారెడ్డి ఖండించారు. మరోవైపు గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థిని మరోసారి బరిలో దింపేందుకు బీజేపీ ఆసక్తి చూపడం లేదనే ప్రచారం జరుగుతోంది.
పార్టీని బలోపేతం చేసేందుకు టీఆర్ఎస్ కీలక నేతలకు కమలం పార్టీ గాలం వేస్తోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చతికిలబడ్డ కాంగ్రెస్.. నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో నైనా సత్తా చాటాలని భావిస్తోంది. జానారెడ్డి లేదా రఘువీర్‌రెడ్డిలో ఒకరిని బరిలోకి దింపాలనుకుంటోంది.