జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీకి బిగ్‌షాక్.. డిపాజిట్లు గల్లంతు.. ఆ ఓట్లు ఏమైనట్లు

Jubilee Hills Bypoll Results : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ ఘన విజయం సాధించారు

జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీకి బిగ్‌షాక్.. డిపాజిట్లు గల్లంతు.. ఆ ఓట్లు ఏమైనట్లు

Lankala Deepak Reddy

Updated On : November 14, 2025 / 3:07 PM IST

Jubilee Hills Bypoll Results : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, BRS అభ్యర్థి మాగంటి సునీతపై 24వేల ఓట్లకుపైగా మెజార్టీతో గెలుపొందారు. ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి నవీన్‌ యాదవ్‌ ఆధిక్యం రౌండ్‌ రౌండ్‌కు పెరిగింది. మరోవైపు ఏ ఒక్క రౌండ్‌లోనూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆధిక్యం దక్కించుకోలేకపోయారు. మరోవైపు.. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు.

జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మొత్తం ఓట్లలో 1/6 వస్తే డిపాజిట్ వస్తుంది. అంటే ఏ పార్టీ అభ్యర్థికైనా డిపాజిట్లు రావాలంటే 32,439 ఓట్లు రావాలి. కానీ, బీజేపీ అభ్యర్థికి 20వేల ఓట్లు కూడా రాలేదు. 17,061ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో జూబ్లీహిల్స్ ఉపపోరులో బీజేపీ డిపాజిట్లు కోల్పోయింది.

బీజేపీ ఓటమిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమిని విశ్లేషించుకుంటామని అన్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తామని చెప్పుకొచ్చారు. ఎంఐఎం సహకరించడం వల్లనే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని, రేవంత్ రెడ్డి ఏం చేశాడని అనుకూలంగా ఆయనకు ఓటేయాలని కిషన్ అన్నారు. జూబ్లీహిల్స్ లో మేము ఎప్పుడూ ఒక కార్పొరేటర్ కూడా గెలవలేదు. మేము ఉన్నంతలో ప్రయత్నం చేశాం. ఎంఐఎం మద్దతు, డబ్బుతోనే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందని కిషన్ రెడ్డి అన్నారు.