బీఆర్‌ఎస్ నుంచి తనను బహిష్కరిస్తారన్న ప్రచారంపై కవిత స్పందన.. కేటీఆర్‌కు కౌంటర్.. సంచలన కామెంట్స్
"అంతర్గతంగా మాట్లాడాలని చెప్పేవారు ఆలోచించాలి. అంతర్గతంగా నేను రాసిన లేఖను బయటపెట్టింది ఎవరు?" అని అన్నారు.

బీజేపీతో బీఆర్‌ఎస్ కలవడమంటే లిక్కర్ నేరాన్ని అంగీకరించినట్లు అవుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మంచిర్యాలలో కవిత మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు.
“నేను జైలులో ఉన్నప్పుడే బీజేపీతో కలవాలనే ప్రతిపాదన వస్తే వ్యతిరేకించాను. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలకు భవిష్యత్తు లేదు. కేసీఆర్‌ను కలుద్దామనుకున్నా.. ప్రతిసారీ ఆయన ప్రజలతోనే ఉంటారు. పార్టీ నుంచి నన్ను బహిష్కరిస్తారని అనుకోవడం లేదు. అంతర్గతంగా మాట్లాడాలని చెప్పేవారు ఆలోచించాలి. అంతర్గతంగా నేను రాసిన లేఖను బయటపెట్టింది ఎవరు?” అని అన్నారు.
కాగా, కేసీఆర్‌కు ఇటీవల కవిత లేఖ రాయడంపై కేటీఆర్ స్పందిస్తూ.. అంతర్గత విషయాలను అంతర్గతంగా మాట్లాడితేనే మంచిదని చెప్పిన విషయం తెలిసిందే.
కవిత ఇంకా ఏమన్నారు?
తనకు ప్రత్యేక ఎజెండా లేదని, కేసీఆర్‌ను ఎవరేమన్నా సరే ఊరుకోబోనని కవిత చెప్పారు. పార్టీని కాపాడుకోవాలనే లేఖ రాశానని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ నేతలు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. తాను రాసిన లెటర్‌ను బయటకు వచ్చేలా చేసిన వారిని పట్టుకోవాలని అన్నారు.
ఆపరేషన్ కగార్ పేరుతో బీజేపీ దుశ్చర్యలకు పాల్పడిందని, నంబాల కేశవ్ రావు ఎన్‌కౌంటర్ విషయంలో మానవత్వం లేకుండా కేంద్రం వ్యవహరించిందని చెప్పారు. మృతదేహానికి అంతిమ సంస్కారాలు కూడా చేయనివ్వకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
ఆపరేషన్ కగార్ ఆపాలని పదేపదే విజ్ఞప్తి చేశామని చెప్పారు. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోల కుటుంబాలు బాధపడుతున్నాయని కవిత తెలిపారు. సరస్వతి పుష్కరాలలో ఎంపీ వంశీకి జరిగిన అవమానంపై చింతిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ దళిత వ్యతిరేకి అని మరోసారి నిరూపించుకుందని తెలిపారు. యాదగిరి గుట్టలో సీఎం రేవంత్ సైతం దళితుడైన భట్టి విక్రమార్కను అవమానించారని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీల వైఖరి సమసమాజ స్థాపనకు వ్యతిరేకమని చెప్పారు.