అవును పెయిడ్ ఆర్టిస్టులతో ఇలా చేయిస్తున్నారు.. కవిత ఈ అంశాన్ని ప్రస్తావించారు: ఎంపీ రఘునందన్ రావు
కవిత ఇప్పుడు చెల్లని రూపాయి అయ్యారని రఘునందన్ రావు చెప్పారు.

“నేను రాసిన లేఖ ఎలా లీక్ అయిందని నేను అడిగితే కొందరు నా మీద సామాజిక మాధ్యమాల ద్వారా దాడి చేస్తున్నారు. పెయిడ్ ఆర్టిస్టులతో నాపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు” అంటూ ఎమ్మెల్సీ కవిత నిన్న మీడియాకు చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు.
ఇవాళ రఘునందన్‌రావు మీడియాతో మాట్లాడుతూ… “నాపై కూడా పెయిడ్ ఆర్టిస్టులతో ఆర్టికల్స్ రాయించారు. కల్వకుంట్ల కవిత అదే అంశాన్ని ప్రస్తావించారు. విదేశాల్లో నుంచి పెయిడ్ ఆర్టిస్టులతో ఇటువంటి పనులు చేయిస్తూ తన వ్యక్తిత్వహననానికి పాల్పడ్డారని కవిత అంటున్నారు.
వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ పెయిడ్ ఆర్టికల్స్ రాస్తున్న వారి గురించి ప్రజలకు తెలపాలి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కుటుంబం వారే ఎదిగారు తప్ప ఎవరూ ఎదగలేదు. అమరవీరులకు ఏ ఒక్క రూపాయి కూడా దక్కలేదు. 1200 మంది అమరులు అయితే శాఖలు పంచుకున్నారు తప్ప తెలంగాణకు చేసింది ఏమీ లేదు.
కవిత ఇప్పుడు చెల్లని రూపాయి అయ్యారు. అందుకే సెల్ఫ్ బ్రాండింగ్ చేసుకోవడం తప్ప కవిత చేస్తుంది ఏమిటి? కవిత, కేటీఆర్‌కు తెలంగాణలో ఏమీ బ్రాండింగ్ లేదు. బీజేపీతో చర్చలు జరిపానని కేసీఆర్‌ను బయటకు వచ్చి చెప్పమనాలి. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవులు తీసుకున్నది బీఆర్ఎస్. 2014లో సోనియా గాంధీ కాల్లు మొక్కి విలీనం చేస్తా అన్నది మీరు కాదా? బీజేపీ ఎదుగుతోందని ఇప్పుడు చెత్త వ్యాఖ్యలు చేస్తున్నారు.
బీజేపీ సొంతంగా నిలబడుతుండటం ఇష్టం లేక ఇలాంటి పొత్తుల పేరుతో చెత్త వాగుడు వాగుతున్నారు. నాన్నకే లేఖలు రాసిన కవిత మీడియాకు కూడా లేఖ రాయాలి. మీ ఇంట్లో పంచాయితీని మీరు మీరు తేల్చుకోండి. కానీ, బీజేపీని అనవసరంగా బీజేపీని లాగకండి. మీ ఇంట్లో, మీ నాన్న పక్కన కోవార్టులు ఉన్నారా? కవిత కొత్త పార్టీ పెడుతున్నారని నాకు సమాచారం ఉంది. బీఆర్ఎస్‌తో కవితకు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి” అని చెప్పారు.
బీజేపీ బలం పుంజుకుంటోందని, కాంగ్రెస్ ప్రజాదరణ కోల్పోతోందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక లోక్‌సభ ఎన్నికల్లో గెలుస్తామని బీఆర్‌ఎస్ గొప్పలు చెప్పుకుందని, ఆ ఎన్నికల్లోనూ సున్నా సీట్లు వచ్చాయని అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఫాంహౌస్‌కు పరిమితం అయ్యిందని తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టి పోటీ చేయలేని పరిస్థితిలో బీఆర్ఎస్‌లో ఉందని అన్నారు. ఎవరు అడగకపోయినా రైతులకు మేలు చేసేలా బీజేపీ కనీసమద్దతు ధరను పెంచిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో హైవేలు, రైల్వే ప్రాజెక్టులు నిర్మిస్తోందని అన్నారు. రాష్ట్ర వాటా ఇవ్వాల్సి ఉన్నా కేంద్ర ప్రభుత్వమే సొంతంగా మొత్తం నిధులతో ప్రాజెక్టులు చేపడుతోందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న బీజేపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.