ఏపీలో హైడ్రా ఏర్పాటు చేయాలి.. వాళ్ల ఇళ్లు కూల్చేయాలి: కేఏ పాల్
నాగార్జున కంటే పవన్ కల్యాణ్ పెద్ద హీరోనా? చంద్రబాబు ఇల్లు కూడా నది పక్కనే...

ka paul
ఏపీలోనూ హైడ్రా ఏర్పాటు చేయాలని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. నది పరివాహక ప్రాంతాల్లో ఇళ్లు కట్టుకున్న వాళ్ల ఇళ్లను కూడా కూల్చి వేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో నాగార్జున వంటి హీరోకి చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేశారని గుర్తుచేశారు.
నాగార్జున కంటే పవన్ కల్యాణ్ పెద్ద హీరోనా? చంద్రబాబు ఇల్లు కూడా నది పక్కనే ఉందని కేఏ పాల్ చెప్పారు. గతంలో తనపై దాడి చేసిన వారు చిత్తుచిత్తుగా ఓడిపోయారని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై మరో ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేయడాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నానని చెప్పారు.
ప్రజాస్వామ్యంలో దాడులు చేసుకోవడం మంచిది కాదని అన్నారు. వరదలు వచ్చి తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయితే ఇప్పటికి నష్టపరిహారం ప్రకటించ లేదని విమర్శించారు. ఏపీ, తెలంగాణ అంటే కేంద్రానికి చిన్న చూపని, వరదలపై బురద రాజకీయం వద్దని అన్నారు. బలహీనంగా ఉన్న వారి పక్షానే తాను ఉంటానని చెప్పారు.
తన మద్దతు ఎప్పుడూ కేసీఆర్ కు ఉంటుందని అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశాలకు వెళుతున్నారు కానీ, ఒక్క కంపెనీని కూడా తీసుకు రాలేకపోయారని విమర్శించారు. తనకు కేవలం ఆరు నెలల టైమ్ ఇస్తే తానే కంపెనీలను తీసుకుని వస్తానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం తాను పోరాడతానని తెలిపారు.
ప్రత్యేక హోదా వస్తే కోటి మందికి ఉద్యోగాలు వస్తాయని, ప్రత్యేక హోదా కోసం తనతో పాటు ఢిల్లీలో ధర్నా చేయాలని పిలుపునిచ్చారు. గతంలో తాను హైదరాబాద్‌కు 700 కంపెనీ తీసుకొచ్చానని, ధర్నా తర్వాత కూడా ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాజీనామా చేద్దామని అన్నారు.
Also Read: ఇక్కడ ఉన్నది దీదీ.. ముఖ్యమంత్రి కాదు.. నేను రాత్రంతా నిద్రపోలేదు: మమతా బెనర్జీ