Kaleshwaram Commission: “కాళేశ్వరం” నోటీసులతో ఈటలకు అధ్యక్ష పగ్గాలు దూరమా!?
ఎమ్మెల్యేల పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Etela Rajender
ఆయన ఆ పదవిపై కొండంత ఆశ పెట్టుకున్నారు. ఆ పోస్ట్ కోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. ఏ క్షణంలోనైనా సదరు పదవి తనను వరిస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇంతలో కాళేశ్వరం కమిషన్ రూపంలో అనుకోని బ్రేక్ వచ్చిపడింది. అవును..తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్న ఎంపీ ఈటల రాజేందర్కు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులు అడ్డంకింగా మారనున్నాయనే టాక్ విన్పిస్తోంది.
బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు చెల్లింపుల విషయంలో ఈటలను విచారించేందుకు పీసీ ఘోష్ కమిషన్ సిద్దమవ్వగా..అదే ఇప్పుడు ఈటలకు ఇబ్బందికరంగా మారిందనే చర్చ రాజకీయవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై క్లారిటీ వచ్చే సమయంలో రాజకీయ దుమారం మొదలైంది. కొన్ని రోజులుగా టీ బీజేపీ చీఫ్ ఎంపికపై ఢిల్లీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్ష పదవితో పాటు కేంద్రమంత్రిగానూ ఉన్నారు. రెండు బాధ్యతలను కిషన్ రెడ్డి మోస్తుండడంతో ఆయన స్థానంలో మరో వ్యక్తిని నియమించాలని డిసైడ్ అయిన పార్టీ హైకమాండ్ దానికి సంబంధించి కొన్ని రోజులుగా కసరత్తు చేస్తోంది.
పార్టీలో అందరినీ కలుపుకుపోయే నాయకుడిపై అధిష్టానం దృష్టి సారించిందట. తెలంగాణలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో 8మంది ఎంపీలను గెలుచుకున్న బీజేపీ..ఈసారి ఎన్నికలంటూ వస్తే అధికారాన్ని దక్కించుకోవాలని లెక్కలు వేసుకుంటోంది. అందుకే ఈసారి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికలో చాలా అంశాలను బేరీజు వేసుకుంటోంది బీజేపీ అధిష్టానం.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరన్న దానిపై ఎప్పటికప్పుడు కొత్త పేర్లు బయటికి వస్తూ…ఉత్కంఠ రేపుతోంది. సంప్రదాయబద్దంగా పార్టీని నడిపించే వాళ్ళు కాకుండా..కాస్తా దూకుడుగా ఉంటూ, పార్టీలో అందరిని కలుపుకుపోతూ, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసే నేత కోసం సెర్చ్ చేస్తోందట కమలం పార్టీ అధిష్టానం. అయితే తెలంగాణ స్టేట్ బీజేపీ చీఫ్ గా ఎంపీని ఎంపిక చేయాలని పార్టీ హైకమాండ్ స్ట్రాంగ్ డెషిషన్ తీసుకుందన్న టాక్ పార్టీవర్గాల్లో విన్పిస్తోంది.
ఈ క్రమంలో రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఐదు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు రేస్ లో ఉన్నారని పార్టీ వర్గాల సమాచారం. ఈ ఐదుగురిలో ఎవరికి అధ్యక్ష్య పదవి పగ్గాలు ఇవ్వాలన్న దానిపై పార్టీ పెద్దలు సీరియస్ గా కసరత్తు చేస్తున్నారట. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అండదండలతో రాష్ట్ర అధ్యక్ష పదవి ఖచ్చితంగా తనకే దక్కుతుందన్న ధీమాతో ఈటల రాజేందర్ ఉన్నారట. ఆ నమ్మకంతో ఉన్న ఈటల..తన సన్నిహితుల దగ్గర కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారట.
అనుకోని అవాంతరం
అయితే ఇప్పుడు ఈటల రాజేందర్ కు అనుకోని అవాంతరం వచ్చిపడిందన్న చర్చ జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్..మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావులతో పాటు ఎంపీ ఈటల రాజేందర్ కు సైతం నోటీసులు జారీ చేసింది. జూన్ 9న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది కమిషన్.
బీఆర్ఎస్ హయాంలో ఈటల రాజేందర్ ఆర్ధిక మంత్రిగా పనిచేయడంతో..కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాజెక్టు నిర్మాణానికి సంబందించిన చెల్లింపుల విషయంలో కమిషన్ ఆయన్ని విచారించనుందని తెలుస్తోంది. దీంతో కాళేశ్వరం కమిషన్ విచారణ ఈటలకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి అడ్డంకిగా మారనుందన్న టాక్ వినిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ప్రభుత్వానికి ఏటీఎంలా మారిందని గతంలో ప్రధాని మోదీ స్వయంగా ఆరోపించిన సందర్బాన్ని రాజకీయవర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఇప్పుడు స్వయంగా ఆ పార్టీ ఎంపీ అయిన ఈటల రాజేందర్ కాళేశ్వరం విచారణ ఎదుర్కొంటుండటం చర్చనీయాంశంగా మారింది.
కాళేశ్వరం విచారణ కమిషన్ నుంచి నోటీసుల అందిన నేపథ్యంలో ఎంపీ ఈటల రాజేందర్ కు పార్టీ పగ్గాలు అప్పగించే విషయంలో ఢిల్లీ అధిష్టానం పునరాలోచనలో పడిందన్న చర్చ జరుగుతోంది. నోటీసుల నేపథ్యంలో ఈటలకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తారా లేదా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేదంటే కాళేశ్వరం కమిషన్ విచారణ పూర్తయ్యే వరకు ఎదురు చూస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.
అయితే పార్టీ పగ్గాలను ఎంపీకే కట్టబెట్టాలని తొలుత నిర్ణయం తీసుకున్నా…ఈటలకు నోటీసుల నేపథ్యంలో పునరాలోచనలో పడిందట. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలను ఎంపీకే కాకుండా ఎమ్మెల్యేల పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి బీజేపీ అధిష్టానం తెలంగాణ పార్టీ చీఫ్ విషయంలో ఈటలను కాదని మరో నేతను ఎంపిక చేస్తుందా అన్నది ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది.