Supreme court: జైలు తప్పదు.. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం.. ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్..
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ విచారణ జరిపింది.

Kancha Gachibowli Land
Supreme court: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ధర్మాసనం సీరియస్ అయింది. చెట్లు కొట్టేసే ముందు అనుమతులు తీసుకున్నారా? లేదా? 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పాఅంటూ జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు.
ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి స్పందిస్తూ.. అనుమతులతోనే ఆ భూముల్లో జామాయిల్ తరహా చెట్లు, పొదలను తొలగించినట్లు కోర్టు తెలిపారు. తెలంగాణలో వాల్టా చట్టం అమలులో ఉందని, దాని ప్రకారం స్వయం అనుమతులుగా ప్రభుత్వం వ్యవహరించిందని అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు విరించారు. అనుమతులతోనే ఆ భూముల్లో జామాయిల్ తరహా చెట్లు, పొదలను తొలగించినట్లు ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి తెలిపారు.
జస్టిస్ బీఆర్ గవాయ్ స్పందిస్తూ.. వీడియోలు చూసి ఆందోళనకు గురయ్యాం. పర్యావరణ పరిరక్షణలో రాజీలేదు. అనుమతులు తీసుకున్నారా..? లేదా..? అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసినందుకు సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. 1996 డిసెంబర్ లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏమాత్రం వ్యవహరించినా చూస్తూ ఊరుకోం అంటూ జస్టిస్ గవాయ్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు.
వంద ఎకరాల్లో జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చాలన్న విషయం పైనే మేము దృష్టి సారించాలని అంటున్నాం. పర్యావరణ పరిరక్షణ కోసం ఏమైనా చేస్తాం. ఆ భూముల్లో ఉన్న జంతుజాలాన్ని ఎలా సంరక్షిస్తారో చెప్పాలి..? ఎంత కాలంలో చేస్తారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లో ప్రణాళిక ఫైల్ చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో స్టేటస్ కో కొనసాగించాలని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు మే 15కి వాయిదా వేసింది.