బెడ్‌మీద నుంచి కిందకు పడి..గిలగిలకొట్టుకుంటున్నా… వీడియోలు తీశారుతప్ప ఆదుకోలేదు

  • Published By: bheemraj ,Published On : July 27, 2020 / 04:00 PM IST
బెడ్‌మీద నుంచి కిందకు పడి..గిలగిలకొట్టుకుంటున్నా… వీడియోలు తీశారుతప్ప ఆదుకోలేదు

Updated On : July 27, 2020 / 4:54 PM IST

కరోనాను చూసి కాదు.. కరోనా వస్తే ఆస్పత్రికి వెళ్లేందుకు బెంబేలెత్తిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ఆస్పత్రుల్లో చోటుచేసుకుంటున్న ఘటనలు జనాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వైద్యుల నిర్లక్ష్యం సాటి రోగుల్లో మానవత్వం లేకపోవడం చూసి ఆస్పత్రులపై ఉన్న కాస్త నమ్మకం కూడా పోతుంది.

మొన్నటికి మొన్న నల్గొండలో తల్లి కళ్లెదుటే కొడుకు కరోనాతో మృతి చెందిన ఘటన ప్రతి మనిషిని కంటతటి పెట్టించింది. కొడుకును బ్రతికించుకోవడం కోసం ఆ తల్లి పడ్డ వేదన గుండెలను పిండేసింది. ఇప్పుడు ఆక్సిజన్ అందక బెడ్ పై నుంచి కింద పడి 45 నిమిషాల పాటు గిలాగిలా కొట్టుకుని చనిపోయిన ఘటన అందరినీ కలిచవేస్తోంది. మరో ఆస్పత్రిలో చనిపోయి 24 గంటలైనా పట్టించుకోని వైనం కన్నీరు తెప్పించడంతోపాటు వైద్యుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తోంది.

మాయదారి కరోనా మరోమారు మానవత్వాన్ని మాయం చేసింది. మంచంపై ఉన్న రోగి కింద పడ్డ ఎవరూ పైకి లేపలేని దుస్థితి తెచ్చింది. సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పాపం ఆ బాధితుడు 45 నిమిషాలపాటు మృత్యువుతో పోరాడి మృతి చెందిన తీరు అందరినీ కలిచివేసింది. ఈ ఘటన వైద్య సిబ్బంది నిర్లక్ష్యాన్ని మరోమారు బట్టబయలు చేసింది. ఈ దారుణ ఘటన కరీంనగర్ జిల్లా ఆస్పత్రిలో చోటుచేసుకుంది.

జిల్లాలోని గంగాధర మండలం వెంకటాయపల్లికి చెందిన 75 ఏళ్లున్న ఓ వ్యక్తికి కరోనా సోకడంతో ఐదురోజులుగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన పరిస్థితి విషమించి మంచం పైనుంచి కాళ్లు చేతులు కొట్టుకుని తుదిశ్వాసం విడిచినట్లు అక్కడి వారు చెబుతున్నారు. రోగి కిందపడి ఉన్న తీరును వారు వీడియో తీసి ఇతరులకు పంపించడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ రోగితోపాటు అదే వార్డులో మరికొంతమంది కూడా చికిత్స పొందుతున్నారు. అయితే ఏ ఒక్కరు కూడా అతన్ని లేపి బెడ్ పై పడుకోబెట్టే ప్రయత్నం చేయలేదు. వీడియోలు తీయడానికే వాళ్లు సమయం కేటాయిచారు. దీంతో సుమారు 45 నిమిషాలపాటు గిలాగిలా కొట్టుకొని చనిపోయారు. ఇక చనిపోయినా చాలా సేపటికి మృతదేహాన్ని సిబ్బంది మంచంపై ఎక్కించినట్లు తెలుస్తోంది. మరోవైపు మృతదేహాన్ని తీసుకెళ్లడానికి కుటుంబీకులు రాత్రి వరకు ఆస్పత్రికి రాలేదు. దీంతో శవాన్ని మార్చురీలో ఉంచారు.

బాధితుడు మంచంపై నుంచి కిందపడిన విషయాన్ని వైద్య సిబ్బందికి చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని వార్డులోని కరోనా బాధితులు ఆరోపిస్తున్నారు. పూర్తిగా సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందంటున్నారు. బాధితుడు కింద పడి చనిపోయిన చాలా సేపటికి సిబ్బంది వచ్చి మృతదేహాన్ని మంచంపై పడుకోబెట్టి అప్పుడు ఆక్సిజన్ పెట్టారని అంటున్నారు. ఆస్పత్రిలో పరిస్థితుల మరీ దారుణంగా ఉన్నాయని తోటి కరోనా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అనంతపురం జిల్లాలో మరో ఘటన వైద్య సిబ్బంది నిర్లక్ష్యాన్ని బయటపెట్టింది. సర్వజన ఆస్పత్రిలో కరోనాతో చనిపోయిన వ్యక్తిని ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. టిఫిన్, భోజనం బెడ్ పైనే పెట్టి వెళ్లారు. కానీ బతికే ఉందా అని కూడా చూడలేదు. చనిపోయి 24 గంటలు అయినా మృతదేహాన్ని తరలించే ప్రయత్నం కూడా చేయలేదు. చివరికి ట్రైనీ కలెక్టర్ వచ్చి మృతదేహం గురించి ఆరా తీస్తే అప్పుడు వైద్య సిబ్బంది కల్లు తెరిచింది. బంధువులకు సమాచారం ఇచ్చి అప్పుడు మృతదేహాన్ని తరలించారు.

ఇక ఈ ఘటనతో వైద్యుల తీరుపై రోగులు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చెప్పేదొకటి చేసేదొకటని మండిపడుతున్నారు. ఆక్సిజన్ పడకలు అందుబాటులో లేవంటున్నారు. పడకల విషయంలో అధికారులు అధికారుల లెక్కలకు వాస్తవాలకు పొంతన లేదని మండిపడుతున్నారు.

మొన్నటికి మొన్న అనంతపురం జిల్లా ఆస్పత్రిలో జరిగిన దారుణం అంతా ఇంతా కాదు వైద్య సిబ్బంది నిర్లక్యంతో నిండ ప్రాణం బలి అయింది. బలైంది. ధర్మవారినికి చెందిన ఓ వ్యక్తి కరోనా బాధపడుతూ తెల్లవారు జామున 3 గంటలకు అనంతపురం ఆస్పత్రికి వచ్చాడు. ఊపిరి ఆడటం లేదు. కాపాడాలంటూ సిబ్బందిని ప్రాధేయపడ్డాడు. సిబ్బంది పట్టించుకోకపోవడంతో నరకయాతన అనుభవించారు. చివరకు ఆయాసంతో భార్య ఒడిలోనే భర్త ప్రాణాలు కోల్పోయాడు.