Liquor scam case: సీబీఐకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ

గతంలో తనకు జారీ చేసిన సెక్షన్ 160 నోటీసుకు ప్రస్తుత సెక్షన్ 41ఏ నోటీసు పూర్తి విరుద్ధంగా ఉందని అన్నారు. సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఎందుకు ఇచ్చారో స్పష్టత లేదని..

Liquor scam case: సీబీఐకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ

kalvakuntla kavitha

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐకి లేఖ రాశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని లేదా ఉపసంహరించుకోవాలని ఆమె అన్నారు. తన ఏవైనా సమాధానాలు కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరవ్వడానికి అందుబాటులో ఉంటానని తెలిపారు.

తనకు ముందే నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నాయని, ఈ నెల 26న సీబీఐ విచారణకు హాజరుకావడం సాధ్యం కాదని చెప్పారు. గతంలో తనకు జారీ చేసిన సెక్షన్ 160 నోటీసుకు ప్రస్తుత సెక్షన్ 41ఏ నోటీసు పూర్తి విరుద్ధంగా ఉందని అన్నారు. సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఎందుకు ఇచ్చారో స్పష్టత లేదని తెలిపారు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ నోటీసులు జారీ చేయడం అనేక ప్రశ్నలకు తావిస్తోందన్నారు. తనకు ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్న వేళ ఢిల్లీకి పిలవడం ఏంటని అన్నారు. ఇది తన ప్రజాస్వామిక, రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిస్తుందని తెలిపారు. సీబీఐ చేస్తున్న ఆరోపణల్లో తన పాత్ర లేదని కవిత అన్నారు. అంతేగాక, కేసు కోర్టులో పెండింగ్‌లో ఉందని చెప్పారు.

ఈడీ నోటీసులు జారీ చేయడంతో తాను సుప్రీంకోర్టును ఆశ్రయించానని అన్నారు. తనను విచారణకు పిలవబోమని అదనపు సొలిసిటర్ జనరల్ సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చారని తెలిపారు. సుప్రీంకోర్టులో ఇచ్చిన హామీ సీబీఐకి కూడా కూడా వర్తిస్తుందని చెప్పారు. గతంలో సీబీఐ హైదరాబాద్‌లోని తన నివాసానికి వచ్చినప్పుడు విచారణకు సహకరించానని తెలిపారు.

Read Also: టికెట్ వస్తుందా? రాదా? కర్నూలు టీడీపీ నేతల్లో టికెట్ల టెన్షన్