KCR Birthday: కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్.. కేటీఆర్, హరీశ్ రావు ఎమోషనల్ ట్వీట్

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజుసందర్భంగా పలువురు రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

KCR Birthday: కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్.. కేటీఆర్, హరీశ్ రావు ఎమోషనల్ ట్వీట్

KCR Birthday

Updated On : February 17, 2025 / 12:11 PM IST

KCR Birthday: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) 71వ పుట్టిన రోజు సందర్భంగా రాజకీయ ప్రముఖులు, ఇతర రంగాల ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా, నేరుగా కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సీఎంవో ‘ఎక్స్’ ఖాతా ద్వారా ‘‘గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నా’’ అంటూ పేర్కొన్నారు.

కాంగ్రెస్ నేత, మంత్రి పొన్నం ప్రభాకర్ ఎక్స్ వేదికగా కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ తో కలిసి ఉన్న ఫొటోను  ఫోస్టు చేశారు. ‘‘గజ్వేల్ శాసనసభ్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆరోగ్యంగా, సుఖశాంతులతో దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నాను’’ అంటూ పేర్కొన్నారు.

కేటీఆర్ ఎమోషనల్..
కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమోషనల్ ట్వీట్ చేశారు. కేసీఆర్ మాట్లాడుతున్న ఫొటో, కేసీఆర్ కాళ్లకు నమస్కారం చేస్తున్న ఫొటోను షేర్ చేశారు. ‘‘ప్రతి తండ్రీ తమ పిల్లల హీరో అని అంటారు. నా తండ్రి నా ఒక్కడికే కాదు.. తెలంగాణ హీరో కావడం నా అదృష్టం. కల కనడం.. దానికోసం హద్దులేని నిబద్ధతతో బయలుదేరారు. విమర్శకులను ఎదుర్కోవడం, అది ఎలా నెరవేరుతుందో వారికి గర్వంగా చూపించారు. తెలంగాణ అనే కలను ప్రేమించారు. వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించకుండా తెలంగాణ సాధించారు. మీరు గర్వంగా మీ కొడుకని పిలుచుకునే వ్యక్తి కావడమే నా లక్ష్యం. మీ వారసత్వానికి అర్హులుగా ఉండటానికి ప్రతీక్షణం కృషి చేస్తా’’ అంటూ కేటీఆర్‌ ఎక్స్‌లో ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు.

కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా హరీశ్ రావు ‘ఎక్స్’ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మీరు నా తలనిమిరే తల్లి ప్రేమ, నాకు ఎనలేని మమకారం పంచిన మేనమామ.. నాకు రాజకీయ చైతన్యాన్ని నేర్పించి, నాలో ప్రజా సేవా సంస్కారాన్ని రంగరించి, నన్ను ఉద్యమ కార్యాచరణలో నడిపించి, నాలోని నాయకత్వ గుణాన్ని ప్రేరేపించి.. నాకు పరిపాలనా సామర్థ్యాన్ని కల్పించి, నన్ను చరితార్థుణ్ణి చేసిన మీరు శత వసంతాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’’ అంటూ హరీశ్ రావు ట్వీట్ లో పేర్కొన్నారు.

 

కవిత పూజలు..
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా బంజారాహిల్స్ నందినగర్ లోని వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. అంతకుముందు  ‘హ్యాపీ బర్త్ డే డాడీ’ అంటూ కేసీఆర్ పాదాలకు నమస్కారం చేస్తున్న ఫొటోను కవిత పోస్టు చేశారు.