KCR: కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో రెండోరోజు కొనసాగిన రాజశ్యామల యాగం

ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య రాజశ్యామల యాగం కొనసాగుతోంది. ఉదయాన్నే యాగశాలకు చేరుకున్న కేసీఆర్‌ దంపతులు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రలతో కలిసి యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేశారు.

KCR: కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో రెండోరోజు కొనసాగిన రాజశ్యామల యాగం

KCR performs Rajashyamala Yagam at his farmhouse for poll victory

Updated On : November 2, 2023 / 6:32 PM IST

KCR Rajashyamala Yagam: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన రాజశ్యామల యాగం రెండోరోజు కొనసాగింది. పండితుల వేద పారాయ‌ణం, రాజ‌శ్యామ‌ల అమ్మవారి మూల మంత్రాలతో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం మారుమోగుతోంది. యాగం రెండో రోజైన గురువారం కేసీఆర్ దంపతులు యంత్రపూజ నిర్వహించారు. ఇక శుక్రవారం ఉదయం 11 గంటల 10 నిమిషాలకు యాగం పూర్ణాహుతి నిర్వహించనున్నారు.

Kalvakuntla Kavitha, Rajashyamala Yagam

Kalvakuntla Kavitha, Rajashyamala Yagam

ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య రాజశ్యామల యాగం కొనసాగుతోంది. గురువారం ఉదయాన్నే యాగశాలకు చేరుకున్న కేసీఆర్‌ దంపతులు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రలతో కలిసి యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంత‌రం రాజశ్యామల చంద్రమౌళీశ్వరుల నిత్య పీఠార్చనకు హాజరైన వారు.. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాష్ట్ర శ్రేయస్సును కాంక్షిస్తూ యజుర్వేద పండితులు ఘనస్వస్తి పలకగా.. యాగంలో సీఎం కేసీఆర్ దంప‌తులతోపాటు, ఎంపీ సంతోశ్, ఎమ్మెల్సీ క‌విత పాల్గొన్నారు.

Sobha, Rajashyamala Yagam

Sobha, Rajashyamala Yagam

రెండో రోజు శివకామ సుందరీదేవి అలంకరణతో దర్శనమిచ్చిన అమ్మవారికి.. సీఎం కేసీఆర్ దంపతులు యంత్ర పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర ప్రత్యేక హారతులు ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు రాజశ్యామల యంత్రం, సుబ్రహ్మణ్య షడావరణ యంత్రానికి పూజలు చేయ‌గా.. పండితులు 11 సార్లు శూలినీ దుర్గ కవచ పారాయణ చేశారు. అనంతరం ఇంద్ర స్తూక్త, నవగ్రహ స్తూక్త హోమంతో పాటు షడావరణ సహిత మూల మంత్రాలతో సుబ్రహ్మణ్య కవచ యాగం నిర్వహించారు.

Also Read: నా ప్రాణం పోయినా ఆ పని చేయను, ఎన్నికల్లో గెలవాల్సింది మీరే- సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్‌ చేపట్టిన రాజశ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం పూర్ణాహుతి ముహూర్తాన్ని ఖరారు చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటల 10 నిమిషాలకు పూర్ణాహుతి ఇవ్వనున్న సమయంలో పాటించాల్సిన నియమాలపై స్వరూపానందేంద్ర స్వామి పండితులతో చర్చలు జరిపారు. రాజశ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగంలో 3 లక్షలకుపైగా రాజశ్యామల అమ్మవారి మూల మంత్రాలను హవనం చేస్తారు. విశాఖ శార‌దా పీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యాగంలో తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 170 మంది రిత్విక్కులు పాల్గొంటున్నారు.