బోయిన్ పల్లి కిడ్నాప్ ఘటన సూత్రాధారి భూమా అఖిలప్రియ.. ఏ1గా చూపిన పోలీసులు

Key details in the Bhuma Akhilapriya remand report : బోయిన్ పల్లి కిడ్నాప్ కేసు సూత్రధారి ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియేనని పోలీసులు నిర్థారించారు. భూమా అఖిలప్రియ రిమాండ్ రిపోర్టులో కీలక వివరాలు వెల్లడించారు. భూమా అఖిలప్రియను ఏ1గా చూపిన పోలీసులు.. ఏవీ సుబ్బారెడ్డిని ఏ2, భార్గవరామ్‌ను ఏ3గా రిమాండ్ రిపోర్టులో చేర్చారు. అలాగే శ్రీనివాసరావు, సాయి, చంటి, ప్రకాశ్‌లను నిందితులుగా పేర్కొన్నారు.
కళ్లకు గంతలు కట్టి తమను తీసుకెళ్లినట్లు బాధితులు చెప్పారని అందులో పొందుపరిచారు. 2016లో హఫీజ్‌పేట సర్వే నం.80లో 25ఎకరాలను బాధితులు కొనుగోలు చేశారని పోలీసులు కోర్టుకు తెలిపారు. భూమి తమదేనని అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి, భార్గవరామ్ వాదిస్తున్నారని, సుబ్బారెడ్డికి ప్రవీణ్‌రావు డబ్బులిచ్చి సెటిల్ చేసుకున్నారని రిపోర్టులో పేర్కొన్నారు.
బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో నిన్న భూమా అఖిలప్రియకు రిమాండ్ విధించారు. భూమా అఖిలప్రియకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు న్యాయమూర్తి. దీంతో ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. బెయిల్ మంజూరు చేయాలని అఖిలప్రియ పిటిషన్ దాఖలు చేశారు. అంతకముందు ఆమెకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.
నీరసం వల్లే అఖిలప్రియ కళ్లు తిరిగి పడిపోయిందని… ఆమెకు ఎలాంటి సమస్య లేదని వైద్యులు తేల్చారు. వైద్య పరీక్షలు పూర్తైన వెంటనే అఖిలప్రియను పోలీసులు రహస్యంగా తరలించారు. ఆ సమయంలో గాంధీ ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఇక వైద్య పరీక్షలు పూర్తవడంతో… అఖిలప్రియను మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు.
బోయినపల్లి కిడ్నాప్ కేసును పోలీసులు మూడు గంటల్లోనే చేధించారు. మొన్న రాత్రి మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు ఆయన సోదరులు సునీల్, నవీన్‌లు కిడ్నాప్‌కు గురయ్యారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి కేసును చేధించారు. కేసులో ఏ1గా ఏవీ సుబ్బారెడ్డి, ఏ2గా ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ, ఏ3గా భార్గవ్‌రామ్ ఉన్నారు. కానీ ఇవాళ బోయిన్ పల్లి పోలీసులు భూమా అఖిలప్రియను ఏ1గా చూపారు. ఏవీ సుబ్బారెడ్డిని ఏ2, భార్గవరామ్‌ను ఏ3గా రిమాండ్ రిపోర్టులో చేర్చారు.