Bandi Sanjay Arrest: బండి సంజయ్ ఎఫ్ఐఆర్‌లో కీలక అంశాలు.. బెయిల్ పిటీషన్ దాఖలుకు సిద్ధమైన బీజేపీ లీగల్ టీం
పేపర్ లీకేజ్ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం విధితమే. విద్యార్థులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా సంజయ్ ప్రవర్తించారని ఎఫ్ఐఆర్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.

Bandi Sanjay Arrest,
Bandi Sanjay Arrest: పేపర్ లీకేజ్ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం విధితమే. అర్థరాత్రి సంజయ్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆయనపై కుట్ర కేసును నమోదు చేశారు. బుధవారం ఉదయం ఉద్రిక్తతల నడుమ బొమ్మల రామారం పీఎస్ నుంచి పోలీస్ కాన్వాయ్‌లో పటిష్ఠ బందోబస్తు మధ్య తీసుకెళ్లారు. హన్మకొండలో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చేందుకు పోలీసులు సంజయ్ ను తీసుకెళ్తున్నట్లు సమాచారం. అయితే, సంజయ్ ఎఫ్ఐఆర్ రిపోర్టులో కీలక అంశాలు పేర్కొన్నారు.
కరీంనగర్‌లో బండి సంజయ్ పై 151 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. విద్యార్థులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా సంజయ్ ప్రవర్తించారని ఎఫ్ఐఆర్ రిపోర్టులో పేర్కొన్నారు. వికారాబాద్, కమలపూర్‌లో పేపర్ లీకేజ్‌లపై బండి సంజయ్ ప్రెస్‌నోట్స్ ఇచ్చారని, పేపర్ లీకేజ్‌లకు ప్రభుత్వమే భాద్యతంటూ ప్రకటించారని, తద్వారా విద్యార్థులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి శాంతి భద్రతల విఘాతం కలిగించేలా ప్రవర్తించారంటూ పోలీసులు ఎఫ్ఐఆర్ రిపోర్టులో పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ధర్నాలు చేయాలని బీజేపీ నేతలకు సంజయ్ పిలుపునిచ్చారని, పరీక్షల నిర్వహణలకు విఘాతం కలిగేలా ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారని, బండి సంజయ్ చర్యల వల్ల మొత్తం పరీక్ష నిర్వహణలు ఇబ్బందులుగా మారుతున్నాయని అన్నారు. అనేక మంది విద్యార్థుల భవిష్యత్ దీనిపై ఆధారపడి ఉందని, విద్యార్థుల పరీక్షలకు విఘాతం కలగకుండా ఉండేందుకే బండి సంజయ్‌ని ప్రివెన్షన్ అరెస్ట్ చేశామని పోలీసులు బండి సంజయ్ ఎఫ్ఐఆర్ రిపోర్టులో పేర్కొన్నారు.
Bandi Sanjay Arrest : బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ లో బండి సంజయ్
ఇదిలాఉంటే.. బండి సంజయ్‌ఫై నమోదు అయిన కేసులో బెయిల్ పిటిషన్ వేసేందుకు బీజేపీ లీగల్ సెల్ టీమ్ సిద్ధమైంది. హనుమకొండ కోర్టు వద్దకు చేరుకున్న బీజేపీ లీగల్ టీమ్.. బండి సంజయ్‌ను రిమాండ్ చేసిన వెంటనే బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.