Khammam : ఖమ్మం మున్నేరు ఉగ్రరూపం.. కాలనీలను చుట్టుముట్టిన వరద.. వరంగల్‌లో క్లౌడ్ బరెస్ట్ ఏర్పడడంతో..

Khammam Munneru Floods ఖమ్మం నగరం సమీపంలోని ధంసలాపురం వద్ద ఆర్ అండ్ బీ రహదారిపై మున్నేరు వరద నీరు మూడు అడుగుల మేర చేరింది.

Khammam : ఖమ్మం మున్నేరు ఉగ్రరూపం.. కాలనీలను చుట్టుముట్టిన వరద.. వరంగల్‌లో క్లౌడ్ బరెస్ట్ ఏర్పడడంతో..

Khammam Munneru Floods

Updated On : October 30, 2025 / 1:02 PM IST

Khammam : మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం అర్ధరాత్రి వరకు కురిసిన వర్షాలతో వాగులు పొంగిప్రవహిస్తున్నాయి. ఖమ్మంలో భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. ప్రమాదకర స్థాయిలో మున్నేరులో వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో ఖమ్మం నగరంలోని మున్నేరు పరివాహక ప్రాంతాలు జలమయం అయ్యాయి. మోతీనగర్, బొక్కలగడ్డ కాలనీలను వరదనీరు చుట్టుముట్టింది. దీంతో మోతీనగర్ లోని 35, బొక్కలగడ్డలోని 57 కుటుంబాలకు పునరావాస కేంద్రాలకు తరలించారు.

ఖమ్మం నగరం సమీపంలోని ధంసలాపురం వద్ద ఆర్ అండ్ బీ రహదారిపై మున్నేరు వరద నీరు మూడు అడుగుల మేర చేరింది. దీంతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం రాపర్తి నగర్ బీసీ కాలనీ వద్ద డంపింగ్ యార్డుకు వెళ్లే రహదారి కొట్టుకుపోయింది. అంతేకాక.. మున్నేరు పరివాహక ప్రాంతంలోని ఏదులాపురం పరిధిలో కేబీఆర్ నగర్, ప్రియదర్శిని కళాశాల ప్రాంతంలో ఉన్న ఇళ్ల చుట్టూ వరద నీరు చేరింది.

Also Read: Azharuddin : అజారుద్దీన్‌కు మంత్రి పదవి.. ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు.. ఎందుకంటే?

మున్నేరు వరద ఉధృతికి ఖమ్మం నగరంలో నీటమునిగి కాలనీలను కలెక్టర్ అనుదీప్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్నేరు ఉధృతి ప్రమాదకర స్థాయిలో పెరగడానికి కారణం వరంగల్ , మహబూబాద్ జిల్లాలో కురిసిన అతి భారీ వర్షాలే నని అన్నారు. వరంగల్ లో క్లౌడ్ బరెస్ట్ ఏర్పడిందని, అందువల్ల ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు మున్నేరులో చేరుతుందని అన్నారు. ఇప్పటి వరకు మూడు డివిజన్ల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందని తెలిపారు. పైనుంచి వరద ప్రవాహాన్ని అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు.. దాన్నిబట్టి మరికొన్ని కాలనీలను పునరావాస కేంద్రాలకు తరలిస్తామని చెప్పారు.

మున్నేరు వరద ప్రవాహం భారీగా వచ్చిన ఇప్పటి వరకు ఎటువంటి ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సహాయక చర్యలకు సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ టీంలు కూడా అందుబాటులో ఉన్నాయని, జిల్లా వాసులు ఎవరూ ఆందోళన చెందొద్దని కలెక్టర్ సూచించారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తిన కలెక్టరేట్ లో ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ లకు టోల్ ఫ్రీ నెంబర్లు 1077, 9063211298 ఫోన్ చేయాలని, వెంటనే మా అధికారులు, సిబ్బంది స్పందించి రక్షణ కల్పిస్తారని చెప్పారు.