అదానీ సెంట్రిక్‌గా రేవంత్‌, కేటీఆర్ డైలాగ్‌వార్.. ఆ ఇద్దరిలో అదానీతో దోస్తానీ ఎవరిది?

వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడి రేవంత్ పరువు తీసుకుంటున్నారని అటాక్ చేశారు కేటీఆర్.

అదానీ సెంట్రిక్‌గా రేవంత్‌, కేటీఆర్ డైలాగ్‌వార్.. ఆ ఇద్దరిలో అదానీతో దోస్తానీ ఎవరిది?

KTR-Revanth Reddy

Updated On : November 26, 2024 / 9:22 PM IST

తెలంగాణ గడ్డ మీద పొలిటికల్‌ హీట్ అంతకంతకు పెరుగుతోంది. ఇష్యూ ఏదైనా ఇన్వాల్‌మెంట్‌ ఉంటే చాలు సీఎం రేవంత్‌ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్. లేటెస్ట్‌గా అదానీ పవర్ అగ్రిమెంట్స్‌ వ్యవహారం రచ్చకు దారి తీయడంతో.. స్కిల్ యూనివర్సిటీ కోసం తెలంగాణ సర్కార్ అదానీ నుంచి తీసుకున్న విరాళం హాట్ టాపిక్ అయింది.

దీంతో రేవంత్‌ను టార్గెట్ చేసింది బీఆర్ఎస్. రాహుల్‌ గాంధీనేమో అదానీని విమర్శిస్తుంటే సీఎం రేవంత్‌ ఆయనతో దోస్తీ చేస్తున్నారంటూ అటాక్ చేసింది. ఇష్యూ అటు తిరిగి పెద్ద వివాదం అవుతుండటంతో సీఎం రేవంత్‌ అదానీ విరాళాన్ని తిరస్కరిస్తున్నామంటూ ప్రకటించారు. అయినా రేవంత్‌ను వదిలిపెట్టడం లేదు బీఆర్ఎస్. దావోస్‌లో చేసుకున్న 12వేల 400 కోట్ల విలువ చేసే ఒప్పందాల మాటేమిటని ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో అదానీ వ్యవహారంలో రేవంత్ వర్సెస్ కేటీఆర్ అన్నట్లుగా పొలిటికల్ పిక్చర్ మారిపోయింది.

అదానీతో తాను దోస్తీ చేస్తున్నానంటున్న కేటీఆర్..ఆయన అదానీని కలిసిన విషయం మర్చిపోయారంటూ విమర్శించారు సీఎం రేవంత్. అదానీతో అంటకాగింది బీఆర్ఎస్ నేతలేనని..గత సర్కార్ హయాంలో అదానీ సంస్థలకు ఎన్నో ప్రాజెక్టులు ఇచ్చారంటూ చెప్పుకొచ్చారు రేవంత్. నేషనల్ హైవేల నిర్మాణం, డేటా సెంటర్లు, ఇతర సంస్థలు ప్రారంభించడానికి కేటాయించిన భూముల విషయంలో మీ మీద ఏమైనా కేసులు పెట్టాలా అంటూ ప్రశ్నించారు.

కేటీఆర్ సీరియస్‌గా రియాక్ట్ 
అయితే రేవంత్ విమర్శల మీద కేటీఆర్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. సీఎంలో నిస్పృహ, అసహనం కనిపిస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ హయాంలో అదానీకి పనులు ఇచ్చామంటూ తప్పుడు మాటలు చెప్తున్నారని మండిపడ్డారు. సీఎం అవగాహనా రాహిత్యంతో మాట్లాడితే ఎలా అంటూ ప్రశ్నించారు. అదానీ తమను కలిసి కొన్ని ప్రతిపాదనలు ఇస్తే అప్పటి సీఎం కేసీఆర్‌ తిరస్కరించారని చెప్పారు కేటీఆర్. తాను అదానీని సీక్రెట్‌గా ఏం కలవలేదని..తన ట్విట్టర్ అకౌంట్‌లోనే పెట్టానంటున్నారు కేటీఆర్. అంతేకాదు అదానీకి..తాము రెడ్‌ సిగ్నల్‌ వేస్తే.. రేవంత్ రెడ్‌ కార్పెట్‌ వేస్తున్నారని విమర్శించారు.

అదానీ విరాళం వద్దంటూ రేవంత్ బ్యాక్ స్టెప్‌ వేయడం తమ విజయమే అంటోంది బీఆర్ఎస్. తాము ఒత్తిడి చేయడం వల్లే..రాహుల్‌ గాంధీ కాంగ్రెస్ అధిష్టానం రేవంత్‌ను చీవాట్లు పెట్టిందని..అందుకే హడావుడిగా విరాళం వద్దంటూ ప్రకటించారని చెప్తోంది. అంతేకాదు అదానీ దగ్గర చెక్కు తీసుకున్నప్పుడు రేవంత్‌కు అదానీ కథేంటో తెలియదా అని ప్రశ్నిస్తోంది.

మరోవైపు బీజేపీ కూడా రేవంత్‌ను టార్గెట్‌ చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. ఎవరికి భయపడి చెక్ వాపస్ చేశారో రేవంత్ రెడ్డి చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఒప్పందం చేసుకున్నప్పుడు రాహుల్ గాంధీకి ఎందుకు భయపడలేదు.? చెక్ వాపస్ ఇవ్వకపోతే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వనని చెప్పాడా.? అంటూ ఎద్దేవా చేస్తున్నారు కమలం లీడర్లు. అదానీతో దావోస్‌లో చేసుకున్న రూ.12వేల కోట్ల ప్రాజెక్టును కూడా రద్దు చేస్తున్నారా అని నిలదీస్తున్నారు.

ఇలా అదానీ వ్యవహారం సీఎం రేవంత్‌కు హెడెక్‌గా మారింది. వంద కోట్ల విరాళం వెనక్కి ఇచ్చే వరకు ఒక లొల్లి ఉంటే..ఇప్పుడు దావోస్ ఒప్పందం మాటేమిటని ప్రెజర్ మొదలైంది. దీంతో అగ్రిమెంట్లు రద్దు చేయడం అంత ఈజీ కాదన్నట్లుగా చెప్తున్నారు సీఎం రేవంత్. దానికి లీగల్‌గా సమస్యలు ఉంటాయని చెప్పుకొస్తున్నారు.

ఒప్పందాల సంగతేంటి అంటూ..
ఈ విషయంలో కూడా రేవంత్‌ను టార్గెట్ చేస్తోంది అపోజిషన్ బీఆర్ఎస్. రేవంత్‌ రెడ్డి తెలంగాణకు సీఎంగా ఉంటూ అదానీ, అల్లుడు, అన్నదమ్ముళ్ల కోసమే పనిచేస్తున్నారని విమర్శిస్తోంది. కాంగ్రెస్ పార్టీ విధానం ప్రకారమే విరాళం వెనక్కి తీసుకుంటే ఒప్పందాల విషయంలో కూడా అంతే సీరియస్‌గా ఎందుకు రియాక్ట్ కావడం లేదో చెప్పాలంటోంది. ఎవరూ విరాళం తీసుకున్నా చర్యలు తీసుకోవాల్సిందేనంటూ రాహుల్ చేసిన కామెంట్స్‌ను కూడా బీఆర్ఎస్ ప్రస్తావిస్తోంది.

అదానీతో దోస్తీ చేస్తూ రేవంత్‌ దోచుకుంటున్నారని బీఆర్ఎస్ అంటే..కేసీఆర్ హయాంలో అదానీకి పనులు ఇచ్చారంటూ సీఎం ఆరోపిస్తున్నారు. ఆ కామెంట్స్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. అదానీతో భేటీ అయింది వాస్తవమే కానీ..ఆయన ప్రపోజల్‌ను తిరస్కరించామని అంటున్నారు. కేంద్రం ఇచ్చిన ప్రాజెక్టులే తప్ప తాము అదానీకి కట్టబెట్టిందేమి లేదంటోంది బీఆర్ఎస్.

వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడి రేవంత్ పరువు తీసుకుంటున్నారని అటాక్ చేశారు కేటీఆర్. ఇలా ఈ ఇద్దరి డైలాగ్‌వార్‌తో ఇంతకీ అదానీతో దోస్తీ చేసిందెవరు.? అనేది హాట్ టాపిక్ అవుతోంది. ఎవరు మాట్లాడిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయనేది చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటికైతే విరాళం వెనక్కి ఇచ్చేసేలా చేసి పైచేయి సాధించామని బీఆర్ఎస్ ఖుషీ అవుతోందట. చూడాలి మరి ఈ వ్యవహారం ఇంకా ఎక్కడికి వరకు వెళ్తుందనేది.

జగన్‌ కుటుంబంలో అదానీ పవర్ స్కామ్‌ రచ్చ.. ప్రత్యర్థుల కంటే దగ్గరివాళ్ల నుంచే విమర్శల తలనొప్పి ఎక్కువ