కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో ముగ్గురు మృతి.. మరో ఇద్దరు పరిస్థితి విషమం.. బాధితులకు మంత్రి జూపల్లి పరామర్శ.. కోటి పరిహారం ఇవ్వాలని ఈటల డిమాండ్
కూకట్ పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటి పరిహారం ఇవ్వాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

Jupally Krishna Rao
Hyderabad: హైదరాబాద్ కూకట్‌పల్లి ఏరియాలో కల్తీకల్లు ఘటన కలకలం రేపుతోంది. కల్లు కాంపౌండ్‌లో కల్తీ కల్లు తాగి మూడు రోజుల్లో ముగ్గురు మృతి చెందగా.. పలువురు అస్వస్థతకు గురయ్యారు. మృతులు సీతారామ్, చాకలి బొజ్జయ్య, నారాయణమ్మలుగా గుర్తించారు. ఆస్పత్రిలో 19మంది బాధితులకు చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
నిమ్స్ ఆస్పత్రిలో ప్రస్తుతం 15 మంది బాధితులకు చికిత్స కొనసాగుతోంది. గాంధీలో మరికొందరు చికిత్స పొందుతున్నారు. అయితే, ఇవాళ ఉదయం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సీతారాం (47) ప్రాణాలు విడిచాడు. వనపర్తి జిల్లా మదిగట్ల గ్రామానికి చెందిన సీతారాం, అనిత దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తొమ్మిదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి హైదర్‌నగర్‌లో ఉంటున్న సీతారాం.. మేస్త్రీగా పనిచేస్తున్నాడు. ఇదిలాఉంటే.. కల్తీ కల్లు ఘటనకు సంబంధించి ఇద్దరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. కల్లు కాంపౌండ్‌లను సీజ్ చేశారు. కల్లు శాంపిల్స్ ల్యాబ్‌కు పంపించి పరీక్షలు చేస్తున్నారు.
నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వారిని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కల్లు కాంపౌండ్ ను సీజ్ చేసినట్లు మంత్రి జూపల్లి తెలిపారు. మరోసారి ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను మంత్రి ఆదేశించారు.
కోటి పరిహారం ఇవ్వాలి.. ఈటల
కూకట్ పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటి పరిహారం ఇవ్వాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. కల్తీ కల్లు ఘటనలో నిన్న ఇద్దరు, ఇవాళ ఒకరు మొత్తం ముగ్గురు చనిపోయినట్లు సమాచారం ఉందని, ప్రభుత్వ మాత్రం నిజాలు దాచాలని చూస్తోందని అన్నారు. కల్తీ కల్లు ఎప్పటి నుంచి అమ్మారు..? ఎంత మంది తాగారు.. అనే పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం సేకరించాలని ఈటల అన్నారు.