Madhu Goud Yaskhi : ఎల్బీనగర్ నా లోకల్, మా అమ్మ నాన్న సమాధులు అక్కడున్నాయి, ఎంగిలి మెతుకుల కోసం ఇలా చేశారు- మధుయాష్కీ గౌడ్
ఎల్బీనగర్ లో గెలిచి శ్రీకాంతాచారికి నివాళి అర్పిస్తామన్నారు. ఎన్నికల సమయంలో బీసీ నేతలపై ఇలాంటివి చేయడం సహజం అన్నారాయన. Madhu Goud Yaskhi - LB Nagar

Madhu Goud Yaskhi (Photo : Google)
Madhu Goud Yaskhi – LB Nagar : హైదరాబాద్ గాంధీభవన్ లో పోస్టర్లు కలకలం రేపాయి. కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్, సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ కు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. సేవ్ ఎల్బీనగర్ కాంగ్రెస్ పేరుతో ఈ పోస్టర్లు వేశారు. ఇటీవల ఎల్బీనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసేందుకు మధుయాష్కీ గౌడ్ దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆయనకు వ్యతిరేకంగా గాంధీభవన్ లో పోస్టర్లు వెలిశాయి. సేవ్ ఎల్బీనగర్ కాంగ్రెస్.. ప్లీజ్ సే నో టికెట్ టు పారాచూట్స్, గో బ్యాక్ టు నిజామాబాద్.. అనే నినాదాలతో ఎల్బీనగర్ కాంగ్రెస్ పేరుతో ఈ పోస్టర్లు వెలిశాయి.
సేవ్ ఎల్బీనగర్ కాంగ్రెస్ అంటూ.. తనకు వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లపై మధుయాష్కీ గౌడ్ తీవ్రంగా స్పందించారు. ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఎల్బీనగర్ నా లోకల్ అన్నారు మధుయాష్కీ గౌడ్. మా అమ్మ నాన్న సమాధులు అక్కడున్నాయని ఆయన చెప్పారు. ఓటమి భయంతోనే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తనపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కొందరు మా పార్టీ నేతలు ఎంగిలి మెతుకుల కోసం సుధీర్ రెడ్డికి సపోర్ట్ చేశారని మధుయాష్కీ గౌడ్ మండిపడ్డారు.
ఎన్నికల సమయంలో బీసీ నేతలపై ఇలాంటివి చేయడం సహజం అన్నారాయన. రాష్ట్రంలో చాలామంది నేతలు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతంలో పోటీ చేస్తున్నారని మధుయాష్కీ గౌడ్ గుర్తు చేశారు. రిసీవ్ చేసుకుంటారో లేదో అన్నది ప్రజలు తేలుస్తారు అని వ్యాఖ్యానించారు. ఎల్బీనగర్ లో గెలిచి శ్రీకాంతాచారికి నివాళి అర్పిస్తామన్నారు. బడుగులకు న్యాయం చేస్తామని.. బీఆర్ఎస్, బీజేపీల కంటే ఎక్కువ టికెట్లు ఇస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ హామీ ఇచ్చారని మధుయాష్కీ గౌడ్ చెప్పారు.