ఎంజీఎం మార్చురీ నుంచి ఒకరి మృతదేహానికి బదులు వేరొకరిది అప్పగింత ఘటనపై మరో బిగ్ ట్విస్ట్..
తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు విస్మయానికి గురిచేస్తోంది.

వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రి మార్చురీ సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఒకరి మృతదేహానికి బదులు మరొకరి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారని ఆరోపణలు వచ్చాయి.
కుమారస్వామి అనే వ్యక్తికి పోస్టుమార్టం చేసిన తర్వాత మార్చురీ సిబ్బంది ఆ మృతదేహాన్ని బంధువులకు ఇచ్చారని వార్తలు వచ్చాయి. అనంతరం రాయపర్తి మండలం మైలారం గ్రామంలో అంత్యక్రియలు చేస్తుండగా అది కుమారస్వామి మృతదేహం కాదని కుటుంబ సభ్యులు గుర్తించారు. కుమారస్వామి మృతదేహానికి బదులు మార్చురీ సిబ్బంది తమకు మరొకరి మృతదేహాన్ని అందించినట్లు తేల్చారు.
ఈ వ్యవహారంలో మరో షాకింగ్ వ్యవహారం బయటపడింది. కుమారస్వామి బతికే ఉన్నాడు. ఎంజీఎం మానసిక వార్డులో అతడు చికిత్స పొందుతున్నాడు. కుమారస్వామి చనిపోయాడని ఔట్ పోస్ట్ సిబ్బంది తప్పుడు సమాచారం ఇవ్వడంతో నిన్న గుర్తుతెలియని వ్యక్తి డెడ్ బాడీని కుమారస్వామి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంత్యక్రియల సమయంలో ఆ డెడ్ బాడీ కుమారస్వామిది కాదని బంధువులు వెనక్కి పంపడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
ఇదీ అసలు సంగతి..
వరంగల్ రైల్వే పోలీసులు జూలై 9వ తేదీన ట్రాక్‌పై గాయాలతో పడివున్న వ్యక్తిని ఎంజీఎంకి తరలించారు. అదే సమయంలో తొర్రూరు నుంచి కుమారస్వామిని పోలీసులు, 108 సిబ్బంది ఎంజీఎంకి తీసుకువచ్చారు. రైల్వే పోలీసులు తరలించిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు.
రైల్వే పోలీసులకు అందించాల్సిన సమాచారాన్ని ఔట్ పోస్ట్ పోలీసులు తొర్రూరు పోలీసులకు అందించారు. ఈ నేపథ్యంలోనే కుమారస్వామి చనిపోయాడని అతడి బంధువులకు డెడ్ బాడీని అప్పగించారు. తప్పుడు సమాచారం వల్ల గందరగోళం నెలకొన్న అంశంపై ఎంజీఎం అధికారులు విచారణ జరుపుతున్నారు.