Hyderabad: మ‌ల‌క్‌పేట శిరీష హత్యకేసులో వెలుగులోకి సంచలన విషయాలు.. అక్క కోసమే..

హైదరాబాద్ మ‌ల‌క్‌పేటలో సంచలనం సృష్టించిన శిరీష హత్య కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. కేవలం తన అక్క మాట వినడం లేదనే కారణంతో ..

Hyderabad: మ‌ల‌క్‌పేట శిరీష హత్యకేసులో వెలుగులోకి సంచలన విషయాలు.. అక్క కోసమే..

Sirisha Death Case

Updated On : March 5, 2025 / 12:05 PM IST

Hyderabad: హైదరాబాద్ మ‌ల‌క్‌పేటలో సంచలనం సృష్టించిన శిరీష హత్య కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. కేవలం తన అక్క మాట వినడం లేదనే కారణంతో భర్త వినయ్ కుమార్ శిరీషకు మత్తు మందు ఇచ్చి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం వినయ్ కుమార్, అతని అక్కను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు వారిని విచారిస్తున్నారు.

మలక్ పేట శిరీష హత్య కేసులో ట్విస్ట్ వెలుగు చూసింది. అక్క కోసమే భార్యను హత్యచేశాడు భర్త వినయ్. అక్క మాట వినకుండా ఎదురు తిరుగుతుందనే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. శిరీషకు మత్తు మందు ఇచ్చి స్పృహ కోల్పోయాక ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. హత్య తరువాత గుండెపోటుతో చనిపోయిందంటూ భర్త వినయ్ అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. వినయ్, అతని సోదరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

 

హన్మకొండ జిల్లా పరకాలకు చెందిన దంపతులకు ముగ్గురు కుమార్తెలు. తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించడంతో చిన్నకూతురు శిరీషను కరీంనగర్ కు చెందిన ఓ ప్రొఫెసర్ దత్తత తీసుకున్నారు. 2016లో నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంటకు చెందిన వినయ్ ను శిరీష ప్రేమ వివాహం చేసుకుంది. ఈ పెండ్లి ఇష్టంలేని ప్రొఫెసర్ కుటుంబం ఆమెను దూరంగా పెట్టింది. దంపతులిద్దరూ మలక్ పేటలోని జమునా టవర్స్ లో నివాసం ఉంటున్నారు. కొంతకాలం ప్రైవేట్ ఉద్యోగం చేసిన వినయ్ ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. శిరీష ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుంది. 2019లో వీరికి పాప పుట్టింది.

 

పెళ్లయిన ఏడాది నుంచే భార్యపై అనుమానంతో వినయ్ తరచూ గొడవపడుతూ ఉండేవాడు. ఈ నెల 2న ఉదయం 10గంటలకు భార్య సోదరి స్వాతికి ఫోన్ చేసి శిరీష గుండెనొప్పితో మరణించినట్లు ఫోన్ చేశాడు. ఈ విషయాన్ని స్వాతి నిజాంపేటలోని మేనమామ మధుకర్ కు చెప్పింది. ఆయన వెంటనే శిరీష నెంబర్ కు ఫోన్ చేసి తనతో మాట్లాడిన మహిళతో మేము వచ్చే వరకు మృతదేహాన్ని అక్కడే ఉంచాలని సూచించాడు. అనంతరం పలుమార్లు ఫోన్ చేసినా స్పందించక పోవటంతో ఆస్పత్రికి ఫోన్ చేశాడు. శిరీష మృతదేహాన్ని అంబులెన్స్ లో స్వగ్రామానికి తీసుకెళ్తున్నట్లు వారు సమాచారం ఇచ్చారు. ఆస్పత్రి నుంచి అంబులెన్స్ డ్రైవర్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసి ఆరా తీయడంతో నాగర్ కర్నూల్ జిల్లాలోని స్వగ్రామానికి వెళ్తున్నట్లు చెప్పాడు. అయితే, పోలీసుల ద్వారా ఫోన్ చేయించి మళ్లీ తిరిగి అంబులెన్సులో మృతదేహాన్ని నగరానికి తీసుకొచ్చారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా చాదర్ ఘాట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

శిరీష మెడచుట్టూ గాయాలను గమనించిన మృతురాలి బంధువులు వినయ్ ను నిలదీయగా పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం. ఛాతినొప్పితో కుప్పకూలిన సమయంలో సీపీఆర్ చేశానని.. ఆ సమయంలో చేతి గోళ్లు గీసుకుపోయినట్లు ఒకసారి, మృతదేహాన్ని తరలించే సమయంలో కుదుపులకు గాయాలైనట్లు మరోసారి చెప్పాడు. ఊపిరాకుండా చేయడంతోనే ఆమె మరణించినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.