బీజేపీ వస్తే రిజర్వేషన్లు రద్దు కావు.. కాంగ్రెస్ మాటలు నమ్మొద్దు: మందకృష్ణ

కాంగ్రెస్ ట్రాప్ లో పడొద్దని ఎస్సీ, ఎస్టీ, బీసీ మేధావులను కోరారు. సీఎం రేవంత్ రెడ్డి మొదలు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇవే మాట్లాడుతూ..

బీజేపీ వస్తే రిజర్వేషన్లు రద్దు కావు.. కాంగ్రెస్ మాటలు నమ్మొద్దు: మందకృష్ణ

Updated On : May 11, 2024 / 5:52 PM IST

Manda Krishna Madiga: కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు, రాజ్యాంగం రద్దు చేస్తుందన్న ప్రచారాలు ప్రజలు నమ్మొద్దని ఎమ్మార్పీస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క‌బ్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ.. తానుండగా రాజ్యాంగం మార్పు ఉండదని దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా చెప్పారని తెలిపారు. కాంగ్రెస్ ట్రాప్ లో పడొద్దని ఎస్సీ, ఎస్టీ, బీసీ మేధావులను కోరారు. కాంగ్రెస్ పార్టీ గ్లోబెల్స్ ప్రచారం చేస్తోందని.. సీఎం రేవంత్ రెడ్డి మొదలు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇవే మాట్లాడుతూ ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

”మోదీ 2024లోనే కాదు 2029లో కూడా ప్రధాని కావాలని కోరుకుంటున్నా. రాజ్యాంగం కాపాడాలని మోదీ కోరుకుంటున్నారు. మల్లికార్జున ఖర్గేకు వయసు మీద పడి మతిపోయింది. చేవెళ్ల డిక్లరేషన్‌లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతామన్నారు ఏమైంది? కాంగ్రెస్‌కు ఎవరు అడ్డం పడ్డారు? రిజర్వేషన్ల గురించి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఎందుకు పెంచడం లేదు? కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచింది. కాంగ్రెస్ పార్టీ మాదిగలను మోసం చేసింది. మాదిగలకు దూరమైన కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల గురించి తప్పుడు ప్రచారం చేస్తోంది.

జనరల్ స్థానాల్లో రెడ్డిలకు టికెట్ ఇచ్చుకున్నారు రేవంత్ రెడ్డి. గత అసెంబ్లీతో పోలిస్తే బీసీలు, ఎస్సీ కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి మల్లికార్జున ఖర్గే మాయలో ఎవరు పడవద్దు. బీజేపీ బలపడితే తెలంగాణలో అశాంతి అన్నాడు రేవంత్ రెడ్డి అది నిజమే కానీ అది దొరలకు, రెడ్లకు మాత్రమే. బీజేపీ బలపడితే దొరలు, రెడ్లు మాత్రమే అశాంతిగా ఉంటారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీలకు మేలు జరుగుతుంది. కాంగ్రెస్ లో బీసీలు ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదు.

Also Read: చంద్రబాబు పవర్‍లో లేరు.. అంతమాత్రాన పార్టీ పోయిందా?- కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

రేవంత్ రెడ్డి నన్ను బీజేపీ నాయకుడు అని అంటున్నాడు. నాకు బీజేపీ సభ్యత్వం లేదు. నువ్వు కండువాలు మార్చుకున్నావ్ కానీ నేను పార్టీ కండువా కప్పుకోలేదు. రేవంత్ రెడ్డి మీ పిట్టల దొర మాటలు ఎవరి మీదనన్న మాట్లాడు, ఎమ్మార్పీఎస్ మీద కాదు. ఎస్సీ వర్గీకరణ కోసమే నేను బీజేపీకి మద్దతు ఇచ్చాను. దేశం భద్రంగా ఉండాలన్న, సామాజిక న్యాయం జరగాలన్నా, దేశం అభివృద్ధి చెందాలన్నా మోదీతోనే సాధ్యం. దేశం అభివృద్ధి కోరుకునే వారు ఓటు బీజేపీకి వేయండి. కులమతాలు, రాజకీయాలకు అతీతంగా బీజేపీకి ఓటు వేయాలని కోరుకుంటున్నాన”ని మందకృష్ణ మాదిగ అన్నారు.