Massive fraud : పంట రుణాల పేరుతో భారీ టోకరా.. 153 మంది రైతుల పేరుతో రూ.2 కోట్ల మోసం
పెద్దపల్లి జిల్లాలో ఇద్దరు బ్యాంక్ మేనేజర్లే బ్యాంక్‌కు టోకరా వేశారు. ఓ కారు డ్రైవరు కలిసి.. ఏకంగా పంట రుణాల్లో గోల్‌మాల్ చేశారు.

Massive Fraud In The Name Of Crop Loans
Massive fraud in the name of crop loans : వాళ్లు రైతులు కాదు.. పంట అసలే వేయరు.. అసలు పొలం ఎక్కడుందో కూడా తెలీదు.. కానీ ఏకంగా నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి బ్యాంకులకే టోకరా పెడుతున్నారు. దీనికి కొందరు అవినీతి అధికారులు వంత పాడుతుండగా.. నకిలీ ముఠాలు మాకేం అడ్డంటూ రెచ్చిపోతున్నాయి. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి బ్యాంకులకు టోకరా వేస్తున్న ఘటనలు కోకొల్లలు జరుగుతుండగా.. పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాల్లోనూ ఇలాంటి బాగోతాలే బయపటపడ్డాయి.
పెద్దపల్లి జిల్లాలో ఇద్దరు బ్యాంక్ మేనేజర్లే బ్యాంక్‌కు టోకరా వేశారు. ఓ కారు డ్రైవరు కలిసి.. ఏకంగా పంట రుణాల్లో గోల్‌మాల్ చేశారు. రామగిరి మండలం సెంటినరీకాలనీలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఇందుకు వేదికైంది. రెవెన్యూ అధికారుల సంతకాల ఫోర్జరీ, నకిలీ పాసుపుస్తకాలు, సొంతంగా తయారు చేయించిన స్టాంపులతో డ్రైవరు కథంతా నడిపించగా.. బ్యాంకు మేనేజర్లు క్షేత్ర స్థాయి పరిశీలన లేకుండా కమీషన్ల కోసం 2 కోట్ల రూపాయలు రుణాలుగా ఇచ్చేశారు. ప్రస్తుత మేనేజర్ ప్రేమానంద్ ఫిబ్రవరి 3న ఈ అక్రమాలను గుర్తించడంతో.. భారీ గోల్‌మాల్ గుట్టురట్టైంది. పోలీసులు ఈ కేసులో 12 మందిని అరెస్టు చేయగా ఐదుగురు పరారీలో ఉన్నారు.
2016 నుంచి 2019 వరకు బ్యాంకు మేనేజర్ కారు డ్రైవర్‌గా పనిచేసిన ప్రభాకర్.. పంట రుణాలు తీసుకోవడానికి ఏ పత్రాలు అవసరమో పూర్తి అవగాహన పెంచుకున్నాడు. ముత్తారం మండలం మైదంబడ్డ గ్రామానికి చెందిన అతడు.. పంట రుణాలు తీసుకోవడానికి అవసరమైన నకిలీ పత్రాలు తయారు చేయించాడు. తనతో పాటు.. జిరాక్స్ సెంటర్లు, రబ్బర్ స్టాంప్‌లు తయారు చేసేవారిని ఈ స్కామ్‌లో భాగం చేశాడు. ఎలాంటి తేడా లేకుండా అచ్చంగా ఒరిజినల్‌లా ఉండేలా ఆర్డీవో, డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్, వీఆర్వో స్టాంపులు తయారు చేయించాడు. పట్టా పాసుపుస్తకాలు, టైటిల్ డీడ్ కోసం మంథని ఆర్డీవో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న సదానందంతో చేతులు కలిపిన ప్రభాకర్.. పక్కా ప్లాన్‌తో కథంతా నడిపాడు.
పంట రుణాలు ఇప్పిస్తానని ఏకంగా 153 మంది రైతులను కార్ డ్రైవర్ ప్రభాకర్ బురిడీ కొట్టించాడు. తర్వాత ప్రభుత్వం వాటిని మాఫీ చేస్తుందని ప్రచారం చేశాడు. ఒక్కో రుణానికి 5 వేల కమీషన్ ఇస్తానని.. అప్పట్లో బ్యాంకు మేనేజర్లుగా పనిచేసిన రామానుజాచార్య, వెంకటేశ్వర్లుతో బేరం కుదుర్చుకున్నాడు ప్రభాకర్. కాసుల కక్కుర్తికి తలొగ్గిన బ్యాంకు మేనేజర్లు.. క్షేత్రస్థాయిలో పరిశీలన లేకుండానే ఒక్కొక్కరికి లక్ష రూపాయల పంట రుణం ఇచ్చేశారు. ఇంత భారీ కుంభకోణంలో.. ప్రభాకర్‌కు మరో 15 మంది వరకూ సహకరించినట్లు పోలీసులు తేల్చారు. స్కామ్‌లో భాగమైన 16 మందిలో ఇప్పటికే 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంకు మేనేజర్లు రామానుజాచార్య, వెంకటేశ్వర్లు సహా ఐదుగురు పరారీలో ఉండగా.. వారికోసం గాలిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న వారి నుంచి ఐదు లక్షల 55 వేల నగదు, నకిలీ పాసుపుస్తకాలు, రబ్బర్ స్టాంపులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.