Rain Alert : బిగ్ అలర్ట్.. మరో వారం రోజులు వానలేవానలు.. ఇవాళ ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షం.. బయటకు రావొద్దు..
Rain Alert : తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో ..

Rain Alert
Rain Alert : తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది.
హైదరాబాద్ లోని అమీర్ పేట్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో గంటపాటు వర్షం దంచికొట్టింది. మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. మంచిర్యాల, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గత 24 గంటల్లో అత్యధికంగా నల్గొండ జిల్లా కనగల్ లో 11.53 సెం.మీ వర్షంపాతం నమోదు కాగా.. నిడమనూర్ లో 8.41 సెం.మీ వర్షపాతం నమోదైంది. అయితే, హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్ జారీ చేసింది. మరో వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
రాష్ట్ర వ్యాప్తంగా క్యుమిలోనింబస్ మేఘాలు దట్టంగా ఏర్పడటంతో కొద్ది సమయాల్లోనే భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. దీనికితోడు ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 13వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే, పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని పేర్కొంది. ముఖ్యంగా రానున్న 48 గంటలు వర్షాల ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఇవాళ (బుధవారం) అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, జగిత్యాల, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులుతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాలు పడే సమయంలో ప్రజలు బయటకు వెళ్లొద్దని, అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పటికీ.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. వర్షాలు పడే సమయంలో చెట్ల కింద, హోర్డింగుల ప్రాంతాల్లో ఉండొద్దని హెచ్చరించారు.