Damodara Raja Narasimha : HMPV అనేది కొత్త వైరస్ కాదు, భయపడాల్సిన అవసరం లేదు- మంత్రి దామోదర రాజనర్సింహ
వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు అతడి నోటి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా మరొకరికి వైరస్ వ్యాపిస్తుందని మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు.

Damodara Raja Narasimha : హ్యుమన్ మెటా న్యూమో వైరస్ కొత్త వైరస్ కాదని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. 2001లోనే ఈ వైరస్ ఉనికిని కనుగొన్నారని ఆయన తెలిపారు. నాటి నుంచే ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వ్యాప్తిలో ఉందని పేర్కొన్నారు. ఈ వైరస్ శ్వాసకోశ వ్యవస్థపై స్వల్ప ప్రభావం చూపిస్తుందన్నారు. వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు అతడి నోటి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా మరొకరికి వైరస్ వ్యాపిస్తుందని మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. చైనాలో ఈ సంవత్సరం HMPV కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నట్టు తెలుస్తోందన్నారు.
”ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాం. కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులతో, మన రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు రెగ్యులర్‌గా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ఈ వైరస్ విషయంలో ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. రాష్ట్రంలో అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ సిద్ధంగా ఉంది.
డిసీజ్ సర్వైలైన్స్ సిస్టమ్‌ను మరింత బలోపేతం చేయాలని, అన్ని రకాల వనరులతో సిద్ధంగా ఉండాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను, జిల్లా అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. సోషల్ మీడియాలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా నిరాధార, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే, ప్రభుత్వం చాలా సీరియస్‌గా పరిగణిస్తుంది” అని వార్నింగ్ ఇచ్చారు మంత్రి దామోదర రాజనర్సింహ.
Also Read : హెచ్‌ఎంపీవీ వల్ల ఎవరెవరికి ముప్పు ఉంటుంది? చిన్నారులకు సోకితే ప్రమాదమా?
అటు భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ కేసుల సంఖ్య తాజాగా ఆరుకి చేరుకుంది. లేటెస్ట్ గా వెస్ట్ బెంగాల్ లో ఒక హెచ్ఎంపీ వైరస్ పాజిటివ్ కేసు నమోదైంది. ఇప్పటికే మూడు రాష్ట్రాలు తమిళనాడు, కర్నాటక, గుజరాత్ లలో హెచ్ఎంపీవీ కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో 2, చెన్నైలో 2 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. అహ్మదాబాద్ లో ఒక కేసు నమోదైంది. బెంగాల్ లోనూ ఓ కేసు బయటపడింది.
అటు హెచ్ఎంపీవీ కేసులపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. అటు కేంద్రం కూడా అలర్ట్ అయ్యింది. హెచ్ఎంపీవీ కేసులపై అప్రమత్తంగా ఉన్నామని కేంద్రమంత్రి జేపీ నడ్డా ప్రకటించారు. ఈ వైరస్ విషయంలో ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.