Minister KTR: ఎన్టీఆర్‌కు సాధ్యంకానిది.. ఆయన శిష్యుడు కేసీఆర్ చేయబోతున్నారు
భారతదేశంలో తెలుగు వారంటూ ఉన్నారని గుర్తించేలా చేసింది ఎన్టీఆరే. చరిత్రలో మహనీయుల స్థానం ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటుంది.

minister ktr
Minister KTR Khammam Tour : ఐటీశాఖ మంత్రి కేటీఆర్ శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్‌బండ్‌లోని నూతనంగా ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ పార్కును మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్‌లతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచ వ్యాప్తంగాఉన్న తెలుగు వారందరికీ రాముడు, కృష్ణుడు అంటే ఎన్టీఆర్ అని అన్నారు. నా చేతులు మీదుగా ఎన్టీఆర్ పార్కును ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
భారతదేశంలో తెలుగు వారంటూ ఉన్నారని గుర్తించేలా చేసింది ఎన్టీఆరే. చరిత్రలో మహనీయుల స్థానం ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటుంది. ఎన్టీఆర్ పాపులారిటీ ముందు సీఎం పదవి కూడా చాలా తక్కువ. తారక రామారావు పేరులోనే పవర్ ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్టీఆర్ శిష్యుడిగా కేసీఆర్ తెలంగాణ అస్తిత్వాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పారు. తెలంగాణ పౌరుషాన్ని చూపించిన నేత కేసీఆర్ అని అన్నారు. దక్షిణ భారతదేశంలో ఎన్టీఆర్ సహా ఇప్పటివరకూ సీఎంగా హ్యాట్రిక్ ఎవరూ కొట్టలేదు.. ఎన్టీఆర్ శిష్యుడిగా సీఎం కేసీఆర్‌కు త్వరలోనే సాధ్యమవుతుందని కేటీఆర్ అన్నారు.
Read Also : BRS Party: బీఆర్‌ఎస్ పార్టీలోకి ఎందుకొచ్చారు.. ఎందుకు వెళ్లిపోతున్నారు?
ఖమ్మం పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ తొలుత కొణిజర్ల మండలం అంజనాపురం వద్ద ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ ను సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదన్నారు. ఆయిల్ పామ్ సాగుతో లాభాలు ఉన్నాయని చెప్పారు. ఈ ప్రాంత రైతులు ఫ్యాక్టరీని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా పైకి ఎదగాలని కేటీఆర్ సూచించారు.