Minister KTR : కేటీఆర్ నోట కోహ్లి మాట, సింగిల్‌గా సెంచరీలు కొట్టడం పక్కా అంటూ వ్యాఖ్యలు
ఆరు దశాబ్దాల పాటు కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చినా చేసిందేమీ లేదు అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణవాదుల పాలనతోనే అభివృద్ధి సాధ్యమన్నారు.

Minister KTR About Congress
Minister KTR Virat Kohli : తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ నేతల మాటలు కోటలు దాటుతున్నాయి. హామీల పరంపరతో పాటు ఎదుటి పార్టీ నేతలపై తూటాల్లాంటి మాటలతో విరుచుకుపడుతున్నారు. మరోసారి విజయం సాధించి ప్రతిపక్షాలను మరోసారి చిత్తు చేయాలనే సంకల్పంతో ఉన్న బీఆర్ఎస్ నేతలు అటు కాంగ్రెస్, ఇటు బీజేపీపై విరుచుపడుతున్నారు. దీంట్లో భాగంగా తన సొంత నియోజకవర్గం అయిన రాజన్న సిరిసిల్ల సభలో పాల్గొన్న సందర్భంగా భారత క్రికెటర్ విరాట్ కోహ్లిలా సెంచరీలు కొడతాం అంటూ వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్. అంతేకాదు సీఎం కేసీఆర్ సింహంలాంటోడు.. సింగిల్ గానే వస్తారు.. కోహ్లిలా సెంచరీలు కొడతారు అంటూ సభలో పాల్గొన్నవారిలో జోష్ నింపారు.
ఆరు దశాబ్దాల పాటు కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చినా చేసిందేమీ లేదు అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణవాదుల పాలనతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. గతంలో రేవంత్ రెడ్డి సోనియాగాంధీని బలి దేవత అని అన్నారని అదే నోటితో ఇప్పుడు కాంగ్రెస్ జపం చేస్తున్నారంటూ విమర్శించారు. 60 ఏళ్లపాటు తెలంగాణాను ఇబ్బందులకు గురి చేసిన కాంగ్రెస్ ను నమ్మాలా, అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ ను నమ్మాలా..? ఏది కావాలో మీరే నిర్ణయించుకుని ఓటు వేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
Also Read: కేసీఆర్ తొమ్మిది కిస్తీల ముఖ్యమంత్రి
ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్ధులను రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్లుగా మాట్లాడారని.. కేసీఆర్ ను కొట్టడానికి ఢిల్లీ దొరలు గుంపులు గుంపులుగా వస్తున్నారు అంటూ విమర్శించారు. క్రికెట్ లో కోహ్లి సెంచరీలు కొడుతున్నట్లుగా మనం కూడా తెలంగాణలో సెంచరీలు కొడతామని కేటీఆర్ అన్నారు. ఢిల్లీ వాళ్లకు అధికారం ఇస్తే.. ఆరు నెలలకోసారి సీఎం మారుతారు అంటూ సెటైర్లు వేశారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు చిల్లరలాంటోళ్లు అంటూ విమర్శించారు. ఈ ఎన్నికల్లో మీరు చెల్మెడ లక్ష్మీనరసింహారావును గెలిపిస్తే నేను వేములవాడను దత్తత తీసుకుంటాను, వెన్నెల వేములవాడగా మారుస్తాను అంటూ హామీ ఇచ్చారు.