KTR Challenge Bandi Sanjay : డ్రగ్ టెస్ట్‌కు నేను రెడీ, చెప్పు దెబ్బలకు నువ్వు రెడీనా? బండి సంజయ్‌కు కేటీఆర్ సవాల్
డ్రగ్ టెస్ట్ కు సిద్ధమా అన్న బండి సంజయ్ సవాల్ కు మంత్రి కేటీఆర్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తనపై ఆరోపణలు చేసిన బండి సంజయ్ చెప్పు దెబ్బలు తినేందుకు సిద్ధమా? అని ప్రతి సవాల్ విసిరారు.

KTR Challenge Bandi Sanjay : తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాల నేతల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ నేతలు సై అంటే సై అంటున్నారు. ఒకరిపై మరొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. తీవ్ర ఆరోపణలు, విమర్శలతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. తాజాగా ఆ రెండు పార్టీల మధ్య డ్రగ్స్ వార్ ముదిరింది.
డ్రగ్ టెస్ట్ కు సిద్ధమా అన్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సవాల్ కు మంత్రి కేటీఆర్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. డ్రగ్ టెస్ట్ కు తాను సిద్ధమన్న కేటీఆర్.. క్లీన్ చిట్ తో బయటికొస్తే తనపై ఆరోపణలు చేసిన బండి సంజయ్ చెప్పు దెబ్బలు తినేందుకు సిద్ధమా? అని చాలెంజ్ విసిరారు.
డ్రగ్ టెస్ట్ కు తన వెంట్రుకలు కావాలో రక్తం కావాలో తీసుకోవాలన్నారు కేటీఆర్. తాను డ్రగ్ టెస్ట్ కు శాంపిల్స్ ఇచ్చి డ్రగ్ టెస్ట్ లో క్లీన్ చిట్ తో బయటకు వస్తానని ధీమాగా చెప్పారు. అప్పుడు బండి సంజయ్ కరీంనగర్ చౌరస్తాలో చెప్పు దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉన్నారా? అని సవాల్ విసిరారు కేటీఆర్. బండి సంజయ్ చిల్లర మాటలు బంద్ చేయాలన్నారు కేటీఆర్.
‘ఫాల్తూ మాటలు, ఫాల్తూ రాజకీయాలు ఎందుకు? ఇదేం చిల్లర రాజకీయం? వీళ్లసలు మనుషులా? నాయకులా? డ్రగ్ టెస్ట్ కు శాంపిల్స్ ఇస్తా. తర్వాత చెప్పుతో కొడితే పడతాడా? డ్రగ్ టెస్ట్ లో నేను చిత్తశుద్ధిగా బయటకు వస్తా. కరీంనగర్ చౌరస్తాలో చెప్పుదెబ్బలు తింటాడా? నా రక్తం తీసుకుపోతాడో, నా చర్మం తీసుకుపోతాడో ఏం తీసుకుపోతాడో తీసుకుపొమ్మను. నా బొచ్చు కావాలంటే నా బొచ్చు కూడా ఇస్తా.
Also Read..Minister KTR: తెలంగాణకు కేంద్ర మంత్రి మాండవీయ క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్
డ్రగ్ టెస్ట్ లో నేను క్లీన్ చిట్ తో బయటకు వచ్చాక కరీంనగర్ చౌరస్తాలో కమాన్ దగ్గర చెప్పు దెబ్బలు తింటాడు. నా చెప్పు కాదు. ఆయన చెప్పుతోనే ఆయన కొట్టుకుంటాడా? కరీంనగర్ కమాన్ దగ్గర కొట్టుకోవాలి. దీనికి సిద్ధమైతే చెప్పు. ఇక్కడనే ఉంటా. రమ్మను. ఏ డాక్టర్లను తీసుకొస్తాడో, ఏ గుండు కొట్టే వాడిని తీసుకొస్తాడో తీసుకురమ్మను. నా బొచ్చు ఇస్తా, నా రక్తం ఇస్తా, నా గోళ్లు ఇస్తా. ఏది కావాలంటే అదిస్తా. నా కిడ్నీ కావాలంటే కిడ్నీ కూడా ఇస్తా. ఇదేం రాజకీయం. అతడికి ఏమైనా తెలివుందా? మనిషా? పశువా?’ అంటూ బండి సంజయ్ పై చెలరేగిపోయారు కేటీఆర్.
రాజకీయంగా ఎదుర్కోలేని వాళ్లే ఇలాంటి చిల్లర ఆరోపణలు చేస్తారని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఢీకొట్టలేకే.. కేంద్రం దర్యాప్తు సంస్థలతో దాడులు చేస్తోందని ఆరోపించారు. మోడీ, బోడీ, ఈడీ వచ్చినా తమకేమీ ఫరక్ పడదన్నారు. వేములవాడ, రాజన్న సిరిసిల్లలో పర్యటించిన కేటీఆర్… సిరిసిల్లలో మీడియాతో మాట్లాడారు. డ్రగ్ టెస్ట్ పై బండి సంజయ్ చేసిన సవాల్ గురించి ప్రస్తావించగా.. కేటీఆర్ ఇలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
కాగా..కేటీఆర్ డ్రగ్ టెస్ట్ సిద్ధమా అని బండి సంజయ్ సవాల్ విసిరారు. డ్రగ్ టెస్ట్ కు వెంట్రుకలు ఇస్తారా? అని అడిగారు. దీనికి కేటీఆర్ చాలా ఘాటుగా బదులిచ్చారు.