Minister Ponnam Prabhakar : ప్రభుత్వాన్ని కూల్చుతాం అంటే ఊరుకోం.. నోరు, ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. సంజయ్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అంటే ఎవ్వరు నమ్మలే.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ కూల్చనుందని బండి సంజయ్ అనడంలో ఎవరెవరు ఒకటో తేటతెల్లం అవుతుందని మంత్రి పొన్నం అన్నారు.

Minister ponnam
Ponnam Prabhakar : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నాడని.. కాంగ్రెస్ వాళ్లు అప్రమత్తంగా ఉండాలంటూ బీజేపీ ఎంపీ సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అంటే ఎవ్వరు నమ్మలే.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ కూల్చనుందని బండి సంజయ్ అనడంలో ఎవరెవరు ఒకటో తేటతెల్లం అవుతుందని పొన్నం అన్నారు. తమ ప్రభుత్వాన్నికూల్చే దమ్ము ఎవరికీ లేదని, మా ఎమ్మెల్యేలు అమ్ముడు పోవడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు.. కోవర్టులు లేరని అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చుతాం అంటే ఊరుకోం.. నోరు, ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అంటూ పొన్నం హెచ్చరించారు.
Also Read : MP Bandi Sanjay : పార్లమెంట్ ఎన్నికల తరువాత ఏదైనా జరగొచ్చు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
ఇంటర్ ఫెయిల్ అయిన బండి సంజయ్ ఏమన్నా జోతిష్క శాస్త్రం చదివాడా? లేకుంటే బీఆర్ఎస్ వాళ్లు ఏమైనా బండి సంజయ్ కి చెప్పారా అంటూ పొన్నం ప్రశ్నించారు. బీజేపీతో మాకు ఎలాంటి పొత్తు ఉండదు.. వారి సహకారం మాకు అవసరం లేదని అన్నారు. బీఆర్ఎస్ ని బొద్దపెట్టాలి.. అభివృద్ధి మీరూ మేము చేసుకుందామని బండి సంజయ్ అంటుడు.. నిన్నటి వరకు డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నరు.. 100 సీట్లలో డిపాజిట్లు రాలేదంటూ పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చాడో చర్చకు రావాలని పొన్నం సూచించారు. ఐదేళ్లలో నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా ప్రజలను మోసం చేసిన ఎంపీల్లో దేశంలోనే నెంబర్ వన్ బండి సంజయ్ అంటూ పొన్నం ధ్వజమెత్తారు.
రాబోయేది దేశ భవిష్యత్తుకు నిర్దేశం చేయబోయే ఎన్నికలు.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుందని పొన్నం ప్రజలకు సూచించారు. ముఖ్యంగా కరీంనగర్ లో మతం పేరు చెప్పి ఒకరు.. ముఖ్యమంత్రికి దగ్గర అని బంధువులకు ఉద్యోగాలు ఇప్పించిన వ్యక్తి ఒకరు ఓట్లు దండుకొనేందుకు వస్తుంటారు.. కానీ, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని పొన్నం ప్రజలను కోరారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కేసీఆర్, బండి సంజయ్, వినోద్ కుమార్ లకు ఓ ఛాలెంజ్ చేశారు. కరీంనగర్ కు వాళ్లు ముగ్గురు ఎంపీలుగా పనిచేశారు. నా హయాంలో ఎన్ని నిధులు వచ్చాయి.. నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది.. వాళ్ల టర్ములో ఏ విధంగా అభివృద్ధి జరిగిందనే విషయంలో చర్చకు రావాలని పొన్నం సవాల్ చేశారు.