Minister Sridhar Babu: రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలకు గుడ్ న్యూస్.. టైర్–2 నగరాల్లోకి ఐటీ విస్తరణ.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
తెలంగాణలో ఐటీ పరిశ్రమల హబ్‌గా మరింత విస్తరింపజేయడంపై ఆసక్తికర కామెంట్స్ చేసిన మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu).
Minister Sridhar Babu announces GCC policy and expansion of IT hubs in Tier-2 cities.
- టైర్-2 నగరాలకు ఐటీ విస్తరణ
- త్వరలోనే నూతన జీసీసీ పాలసీ
- కొత్త డేటా సెంటర్ల ఏర్పాటు
Minister Sridhar Babu: తెలంగాణను ఐటీ పరిశ్రమల హబ్‌గా మరింత విస్తరింపజేస్తూ, నూతన ఉద్యోగ అవకాశాల సృష్టికి కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తోంది. గతంలో సరైన ముందస్తు వ్యూహం, పారిశ్రామిక భాగస్వాములు లేకపోవడం వల్ల నిరుపయోగంగా మారిన ప్రాంతీయ ఐటీ హబ్‌లకు పునర్వైభవం తీసుకురావాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఐటీ రంగ విస్తరణ, నూతన డేటా సెంటర్లు, టైర్-2 నగరాల అభివృద్ధిపై శాసనసభ వేదికగా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) కీలక విధాన ప్రకటన చేశారు.
టైర్-2 నగరాలకు ఐటీ.. నిరుపయోగ హబ్‌లకు ప్రాణం:
గత ప్రభుత్వ హయాంలో ఇండస్ట్రీ పార్టనర్స్ లేకుండా నిర్మించిన ఐటీ టవర్లు చాలా చోట్ల మూతపడ్డాయని, వాటిని తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్‌పై ఒత్తిడి తగ్గించేందుకు నల్గొండ, నిజామాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్ వంటి నగరాలకు పరిశ్రమలను విస్తరిస్తున్నామన్నారు. త్వరలోనే ఆదిలాబాద్ ఐటీ హబ్‌ను ప్రారంభించబోతున్నామని స్పష్టం చేశారు. అలాగే ప్రతిష్టాత్మక ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి కేంద్రం సహకరించాలని, బీజేపీ సభ్యులు దీనిపై చొరవ చూపాలని కోరారు.
రికార్డు స్థాయిలో ఉద్యోగాలు.. కొత్త జీసీసీ పాలసీ:
గడిచిన రెండేళ్లలో హైదరాబాద్‌లో 75కి పైగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు ప్రారంభమై దేశంలోనే రికార్డు సృష్టించాయని, లక్ష మంది యువతకు కొత్తగా ఉద్యోగాలు దక్కాయని మంత్రి వెల్లడించారు. త్వరలోనే సరికొత్త జీసీసీ పాలసీని తీసుకురాబోతున్నామని చెప్పారు. కాంప్రహెన్సివ్ ఎకో సిస్టం కోసం డేటా సెంటర్లను ప్రాధాన్యతగా తీసుకుంటున్నామని, స్థానిక అవసరాలకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక విద్యుత్ ఏర్పాట్లతో టైర్-2, టైర్-3 నగరాల్లోనూ డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తామని సభకు వివరించారు.
