Madras High Court : భర్తను తల్లిదండ్రుల నుంచి విడదీసి ప్రత్యేకంగా కాపురం పెట్టమంటే.. క్రూరత్వమే: మద్రాస్ హైకోర్టు
Madras High Court : వివాహం తర్వాత భర్త తన తల్లిదండ్రుల నుంచి విడిపోయి ప్రత్యేకంగా కాపురం పెట్టాలని భార్య పదేపదే ఒత్తిడి చేయడం మానసిక క్రూరత్వం అవుతుందని కోర్టు పేర్కొంది.
Wife And Husband
Madras High Court : వివాహం తర్వాత భర్త తన తల్లిదండ్రుల నుంచి విడిపోయి ప్రత్యేకంగా కాపురం పెట్టాలని భార్య పదేపదే ఒత్తిడి చేయడం మానసిక క్రూరత్వంగా పరిగణించవచ్చని మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ముఖ్యంగా భర్త తన తల్లిదండ్రులకు ఏకైక కుమారుడై, వారిని చూసుకోవాల్సిన బాధ్యతఉన్న సందర్భంలో ఇలాంటి ఒత్తిడి సమంజసం కాదని కోర్టు పేర్కొంది.
భర్త పెట్టుకున్న విడాకుల దరఖాస్తులను ఫ్యామిలీ కోర్టు సమర్ధించడంతో దాన్ని సవాల్ చేస్తూ భార్య మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఆమె పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు పిటిషన్ను కొట్టివేసింది. న్యాయమూర్తులు జస్టిస్ పి.టి. ఆశా, జస్టిస్ ఎన్. మౌలా ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ జరపగా.. ఈ సందర్భంలో పలు కీలక వ్యాఖ్యలు చేసింది. భార్య తన భర్తను కుటుంబం నుంచి వేరుచేసి ప్రత్యేక ఇల్లు ఏర్పాటు చేసుకోవాలని బలవంతం చేయడం వల్ల అతడిపై మానసిక ఒత్తిడి ఏర్పడుతుందని కోర్టు అభిప్రాయపడింది. తల్లిదండ్రుల పట్ల కుమారుడికి ఉన్న బాధ్యతలను పూర్తిగా పక్కన పెట్టాలని ఒత్తిడి చేయడం వివాహ బంధంలో క్రూరత్వానికి దారితీస్తుందని స్పష్టం చేసింది.
ఈ కేసులో భర్త తన తల్లిదండ్రులకు ఏకైక కుమారుడని, వారి బాధ్యత తనపై ఉందని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అలాంటి పరిస్థితుల్లో భార్య పదేపదే వేరే ఇంట్లో కాపురం పెట్టాలని పట్టుబట్టడం సాధారణ వైవాహిక విభేదంగా కాకుండా, భర్తపై మానసిక వేధింపులకు దారితీసే అంశంగా చూడవచ్చని పేర్కొంది. ఎలాంటి కారణాలు లేకుండా అప్పీలుదారైన భార్య పుట్టింట్లోనే నెలల తరబడి ఉండటం ఎంతవరకు సమంజసమని పేర్కొంది.
భార్య చర్యను తాము సమర్థించలేమని తెలిపింది. భర్తను ఇలాంటి చర్యలతో ఎడబాటుకు గురిచేయడం క్రూరత్వం కిందే వస్తుందని కోర్టు పేర్కొంది. వైవాహిక బంధాన్ని కరుణ, పరస్పర సర్దుబాటు, ప్రేమతో వృద్ధి చేసుకోవాలిగానీ, విరుద్ధంగా వెళ్లకూడదని కోర్టు వ్యాఖ్యానించింది.
