అర్హులందరికీ రుణమాఫీ చేస్తాం, రైతుల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్‌కు లేదు- మంత్రి తుమ్మల

గతంలో రుణమాఫీ ఒక దోపిడీ పద్ధతిలో జరిగిందని కాగ్ నివేదిక ఇచ్చింది. అసలైన రైతులకు ఇవ్వలేదు.

అర్హులందరికీ రుణమాఫీ చేస్తాం, రైతుల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్‌కు లేదు- మంత్రి తుమ్మల

Tummala Nageswara Rao : బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. అధికారంలో ఉండగా ఏనాడు రైతులను పట్టించుకోలేదని బీఆర్ఎస్ పై మండిపడ్డారు. బీఆర్ఎస్ కు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దని, అర్హులందరికీ రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.

”అధికారం కోల్పోయిన వారు ఏమైనా మాట్లాడొచ్చు. కానీ రైతులను మోసం చేయకూడదు. రైతులను దగా చేసిన మీరు నేడు వారి గురించి మాట్లాడటం సిగ్గుచేటు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం మొదటి పంటకు రుణమాఫీ చేశాం. రూ.31 వేల కోట్ల కేటాయింపు కష్టమే అయినా ఒకే పంట కాలంలో రైతుల ఖాతాలో జమ చేశాం. ఆగస్టు 15 లోపు 2లక్షల రుణాలు మాఫీ చేస్తాం అని చెప్పాం. జూలై 15న జీవో ఇచ్చాం, ఆగస్టు 15లోపు చేశాం. బ్యాంకు తప్పిదాలు, ఆధార్ తప్పులు, రుణమాఫీ కానీ వారి ఇంటికి వెళ్ళి మాఫీ చేయాలని చెప్పాం. ఆ ప్రక్రియ షూరూ చేశాం.

రుణమాఫీ కానీ వారు మండల వ్యవసాయ అధికారి, రైతు వేదిక వద్దకి వెళ్ళాలి. గతంలో లాగానే రుణమాఫీ చేస్తున్నాం. అధికారం పోయిందని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. వెళ్ళి బ్యాంకులను అడగండి. రూ.31 వేల కోట్ల రైతుల రుణమాఫీ చేశాం. ఆగస్టు 15 లోపు 2లక్షలు వరకు చేస్తాం. మిగిలినవి షెడ్యూల్ ప్రకారం మాఫీ చేస్తాం. ఆగస్టు 15 లోపు 18 వేల కోట్లు రుణమాఫీ చేశాం. ఒకే నెలలో పంట రుణమాఫీ చేశాం. దేశంలో ఒక చారిత్రక ఘటన. అధికారం వస్తుంది. పోతుంది.. రైతులను ఆందోళన గురి చేసి రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటే మీ చరిత్ర వెంటాడుతుంది.

40 లక్షల ఖాతాలు ఉంటే 16 లక్షల ఖాతాలకే చేశారు. ఎన్నికల ముందు బూటకపు ప్రచారం చేశారు. రుణమాఫీ కోసం ఓఆర్ఆర్ ని తరగనమ్మి రూ.11 వేల కోట్లు ఇచ్చారు. ఇంకా బాకీ ఉంది. మంచి మాట అనటానికి నోరు రాకపోతే మానేయండి. గతంలో రుణమాఫీ ఒక దోపిడీ పద్ధతిలో జరిగిందని కాగ్ నివేదిక ఇచ్చింది. అసలైన రైతులకు ఇవ్వలేదు.

మా ప్రభుత్వం అలాంటి తప్పులు చేయదల్చుకోలేదు. తెల్ల కార్డు ద్వారా ఉన్న వాటికి రుణమాఫీ జరిగింది. కొంత మందికి తెల్ల కాగితం కాదు. అంకెలతో ఇస్తాం.. కేటీఆర్ కి ధన్యవాదాలు. మొదటిసారిగా రైతుల గురించి మాట్లాడే అవకాశం వచ్చింది. చీప్ మాటలు అంటూ చీప్ గా వ్యవహరిస్తున్నారు కాబట్టే సీఎం రేవంత్ కూడా మిమ్మల్ని అలానే మాట్లాడుతున్నారు. గౌరవంగా ఉండాలి. ప్రజల పక్షం ఉండాలి. కానీ వ్యక్తిగతం కోసం కాదు. అమాయక రైతులను గందరగోళం చేయవద్దు. ప్రతి ఒక్కరికీ రుణమాఫీ వర్తిస్తుంది. 2 లక్షలు పైన రుణాలున్న రైతుల అంశంపై క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. గుండె మీద చేయి వేసుకుని వ్యవసాయం చేసుకోండి. డ్రిప్ ఇవ్వలేని వారు, సబ్సిడీ ఇవ్వని వారు, పంట నష్టం ఇవ్వని వారు తగుదనమ్మా అని ఆందోళన చేస్తున్నారు” అని ప్రతిపక్షాలపై మండిపడ్డారు మంత్రి తుమ్మల.

Also Read : మహిళా కమిషన్ వర్సెస్ కాంగ్రెస్ నేత..! చిచ్చు రాజేసిన వేణుస్వామి వ్యవహారం..!