Miss World 2025 : ఓరుగల్లులో ప్రపంచ అందగత్తెలు.. రామప్ప, వెయ్యి స్తంభాల గుడిని సందర్శించిన సుందరీమణులు.. కాకతీయుల కళా వైభవానికి ఫిదా..

చూపు తిప్పనివ్వని రామప్ప శిల్పాల హోయలకు ముగ్దులయ్యారు.

Miss World 2025 : ఓరుగల్లులో ప్రపంచ అందగత్తెలు.. రామప్ప, వెయ్యి స్తంభాల గుడిని సందర్శించిన సుందరీమణులు.. కాకతీయుల కళా వైభవానికి ఫిదా..

Courtesy @IPRTelangana

Updated On : May 14, 2025 / 9:39 PM IST

Miss World 2025: మిస్‌ వరల్డ్‌ అందాల పోటీల్లో పాల్గొనేందుకు తెలంగాణకు వచ్చిన అందాల భామలు ఓరుగల్లులో సందడి చేశారు. అచ్చం తెలుగింటి ఆడపడుచుల్లా ట్రడిషనల్ చీరల్లో అందరినీ అట్రాక్ట్ చేశారు ప్రపంచ సుందరీమణులు. రామప్ప, వెయ్యి స్తంభాల గుడిని సందర్శించారు. అక్కడి శిల్పకళ సంపద చూసి ఆశ్చర్యపోయారు.

ములుగు జిల్లా రామప్ప ఆలయాన్ని ప్రపంచ సుందరీమణులు సందర్శించారు. అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. గుస్సాడీ నృత్య ప్రదర్శన, ఒగ్గు డోలు ప్రదర్శన ద్వారా కళాకారులు ఆత్మీయంగా వెల్ కమ్ చెప్పారు. అనంతరం వారు ఆలయంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ విశిష్టత, చరిత్రను అడిగి తెలుసుకున్నారు.

నందీశ్వరుడిని చూసి విశ్వ సుందరీమణులు సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. ఆయన చెవిలో తమ కోరికలు చెప్పుకున్నారు. ఆ తర్వాత బతుకమ్మ పాటకు సంప్రదాయ దుస్తుల్లో అక్కడి మహిళతో కలిసి స్టెప్పులు వేశారు.

కాకతీయుల కళా వైభవానికి ముద్దుగుమ్మలు ఫిదా అయిపోయారు. చూపు తిప్పనివ్వని రామప్ప శిల్పాల హోయలకు ముగ్దులయ్యారు. వేయి స్తంభాల ఆలయమంతా కలియ తిరిగిన సుందరీమణులు నిర్మాణ నైపుణ్యానికి ఆశ్చర్యపోయారు. సంప్రదాయ దుస్తుల్లో హాజరైన ముద్దుగుమ్మలు ఇరు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.

Img Credit Google

చీరకట్టులో ఆలయానికి వచ్చిన అందాల భామలు.. రామప్ప శిల్ప సౌందర్యానికి ముగ్దులయ్యారు. శతాబ్దాలు దాటినా చెక్కు చెదరకుండా సాండ్‌ బాక్స్‌ టెక్నాలజీతో నిర్మితమైన రామప్ప ఆలయ ప్రత్యేకతను తెలుసుకున్నారు. నీటిలో తేలియాడే ఇటుకలను చూసి ఆశ్చర్యపోయారు.

“తెలంగాణ జరూర్‌ ఆనా” పేరుతో మిస్ వరల్డ్ అందాల పోటీలను రేవంత్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ అందాల పోటీల్లో పాల్గొనడానికి ప్రపంచంలోని 50కి పైగా దేశాలకు చెందిన 57మంది ముద్దుగుమ్మలు వచ్చారు. హనుమకొండలోని హరిత హోటల్‌లో టూరిజం శాఖ అతిథులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.