MLA Anirudh Reddy : పుష్ప 2 కు రూ.1700 కోట్లు వస్తే రేవతి కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వలేరా?- ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తొక్కిసలాట ఘటనతో సినిమా టికెట్లు ఇంకా ఎక్కువ అమ్ముడయ్యాయి. మరింత ఆదాయం వచ్చింది.

MLA Anirudh Reddy : సంధ్య థియేటర్ ఘటన బాధాకరం అన్నారు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. ఘటన జరిగిన వెంటనే అల్లు అర్జున్ ఆ కుటుంబాన్ని పరామర్శించి, న్యాయం చేసి ఉంటే పరిస్థితి ఇంత దూరం రాకపోయి ఉండేదన్నారు. కానీ, వాళ్లు బిజినెస్ పరంగా ఆలోచించారని విమర్శించారు. బాధిత కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పుష్ప 2 సినిమా 1700 కోట్ల రూపాయలు వసూలు చేసిందని, అందులో కోటి రూపాయలు బాధితురాలికి ఇస్తే ఏమవుతుందని ఆయన ప్రశ్నించారు.
‘జరిగిన ఘటన చాలా బాధాకరం. మన దేశంలో స్పోర్ట్స్ మెన్, పొలిటీషియన్స్, సినీ ఫీల్డ్ కళాకారులకు.. ఈ ముగ్గురికి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అయితే, ఇవాళ ఇద్దరి మధ్యలో ఒక పక్క పొలిటీషియన్స్, ఒక పక్క సినిమా ఫీల్డ్ .. ఇద్దరూ కొట్టుకుంటూ ఉంటే కొందరు నవ్వుకుంటున్నారు. మరికొందరు వీళ్లు కరెక్ట్ వాళ్లు కరెక్ట్ అంటున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమో పొలిటీషియన్స్ ది తప్పు అంటున్నారు. పొలిటీషియన్స్ ఏమో.. చేసిన విధానం తప్పు అంటున్నారు.
ఇంత ఘటన జరిగిన తర్వాత కూడా, టీవీల్లో వస్తుంటే కూడా, ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజు ఘటన జరిగిన రోజునే బాధిత కుటుంబాన్ని కలిసి సమన్వయం చేసి ఉంటే ఇంత దూరం రాకపోయి ఉండేది. వాళ్లంతా బిజినెస్ గురించే ఆలోచిస్తారు. రూపాయి పెట్టామా 10 రూపాయలు వచ్చాయా అని ఆలోచిస్తారు. రాజకీయ నాయకులు ఏమో పేదల గురించి ఆలోచిస్తారు. మేము పేదల గురించి ఆలోచన చేశాం. వాళ్ల కుటుంబం గురించి ఆలోచన చేశాం.
ఘటన జరిగిన ఇన్ని రోజుల తర్వాత కూడా ఎవరూ స్పందించలేదు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెళ్లి బాధిత కుటుంబానికి రూ.25లక్షలు ఇచ్చిన తర్వాత, సినిమా నిర్మాతలు వెళ్లి రూ.50లక్షలు ఇచ్చారు. థియేటర్ లో ఆ రోజు జరిగిన తొక్కిసలాట ఘటనతో.. ఎందుకు ఈ యాక్సిడెంట్ అయ్యింది, ఇంతమంది అక్కడికి ఎందుకు వెళ్లారని చెప్పి టికెట్లు ఇంకా ఎక్కువ సేల్స్ అయ్యాయి. దాంతో వారికి ఇంకా ఆదాయం ఎక్కువ వచ్చింది. పుష్ప 2 సినిమాకి రూ.1700 కోట్లు వచ్చినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. 1700 కోట్లలో బాధిత కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వలేరా? ఇస్తే ఏమవుతుంది?’ అని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చిత్ర యూనిట్ ను ప్రశ్నించారు.
Also Read : ఫైర్ ఎవరు? ఫ్లవర్ ఎవరు? గవర్నమెంట్ వర్సెస్ గ్లామర్ ఫీల్డ్..