Veerlapally Shankar: వివాదంలో షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌.. పూర్తి వివరాలు

ఇలా ఎప్పుడూ ఎవరో ఒకరు కాంట్రవర్సీ కామెంట్స్ చేసి పార్టీని ఇరకాటంలో పెడుతున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారట పీసీసీ పెద్దలు.

Veerlapally Shankar: వివాదంలో షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌.. పూర్తి వివరాలు

Updated On : December 7, 2024 / 9:41 PM IST

ఒకే ఒక స్టేట్‌మెంట్‌తో కాంట్రవర్సీలో ఇరుక్కుపోయారు షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. అపోజిషన్‌ను విమర్శించబోయి..ఓ సామాజికవర్గంపై తీవ్రస్థాయిలో కామెంట్స్ చేసి కాంట్రవర్సీకి కేరాఫ్ అయ్యారు. వెలమ వర్గం మీద ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. భౌతికదాడులకు సిద్ధమేనని..సీఎంకు తెలియకుండా తామే రంగంలోకి దిగుతామంటూ మాట్లాడారు వీర్లపల్లి శంకర్‌. ఆయన కామెంట్స్ కాంట్రవర్సీ కావడంతో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ నేతలను విమర్శించబోయి మాట జారినట్లుగా చెప్పుకొచ్చారు.

వీర్లపల్లి శంకర్ కామెంట్స్‌పై అపోజిషన్‌ బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. కులాలను కించపరిస్తే తగిన బుద్ధి చెబుతామని..వీర్లపల్లి శంకర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అటు కాంగ్రెస్ పార్టీలోనూ సదరు సామాజిక వర్గం నేతలు వీర్లపల్లి శంకర్‌ కామెంట్స్‌తో హర్ట్ అయ్యారట. ఎనిమిది ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ షాద్‌ నగర్‌ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ పెద్దలను కోరారట. అంతేకాదు ఏకంగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా రెడీ అయ్యారు.

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం లేవడంతో TPCC రియాక్ట్ అయింది. వివరణ ఇవ్వాల్సిందిగా ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి..మరో సామాజిక వర్గాన్ని దూషించే అధికారం ఎవరికి లేదన్నారు TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. ఓ సామాజిక వర్గాన్ని కించపరచడం కాంగ్రెస్ సిద్ధాంతం కాదంటూ పార్టీ పరంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా వ్యవహారం
పీసీసీ నోటీసులు ఇచ్చినా..ఎమ్మెల్యే తన కామెంట్స్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించినా..వివాదం మాత్రం ముగియడం లేదు. సదరు సామాజిక వర్గం నేతలు ఎమ్మెల్యే కామెంట్స్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. చట్టపరంగా, పార్టీ పరంగా ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీర్లపల్లి శంకర్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. ఆయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనే దానిపై పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇలా ఎప్పుడూ ఎవరో ఒకరు కాంట్రవర్సీ కామెంట్స్ చేసి పార్టీని ఇరకాటంలో పెడుతున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారట పీసీసీ పెద్దలు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల దుమారం కోర్టు మెట్లెక్కగా..ఇప్పుడు మళ్లీ వీర్లపల్లి కామెంట్స్ ఎటు దారి తీస్తాయోనని ఆందోళన చెందుతున్నారట. ఆయన చేసిన కామెంట్స్ మీద సదరు సామాజిక వర్గానికి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ అధికార పార్టీపై తీవ్రస్థాయిలో పార్టీ మీద ఒత్తిడి తెస్తున్నారట. యాక్షన్‌ తీసుకోవాల్సిందేనని పట్టుబడుతున్నారట. దీంతో వీర్లపల్లి శంకర్‌ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే సమస్య సద్దుమణుగుతుందనే దానిపై సమాలోచనలో చేస్తోందట పీసీసీ.

YS Jagan: సిక్కోలు వైసీపీలో ప్రక్షాళనకు జగన్ ప్లాన్..!