ఎమ్మెల్యేగా ఓడినా బాధ లేదు.. కొడంగల్‌తో దీటుగా జగిత్యాల అభివృద్ధి: జీవన్ రెడ్డి

గతంలో పులివెందులతో పోటీ పడి జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని, ఇప్పుడు కొడంగల్‌తో పోటీపడి అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పారు.

ఎమ్మెల్యేగా ఓడినా బాధ లేదు.. కొడంగల్‌తో దీటుగా జగిత్యాల అభివృద్ధి: జీవన్ రెడ్డి

Updated On : March 19, 2024 / 6:59 PM IST

MLA Jeevan Reddy నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్దరణ బాధ్యత తనదని.. సంవత్సరంలోపు షుగర్ ఫ్యాక్టరీ తెరిపించే బాధ్యత తాను తీసుకుంటానని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ.. గతంలో పులివెందులతో పోటీ పడి జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని, ఇప్పుడు కొడంగల్‌తో పోటీపడి అభివృద్ధి చేస్తానని చెప్పారు. కొడంగల్ నియోజకవర్గానికి మించి జగిత్యాలను ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. ఎమ్మెల్యేగా ఓడినా తనకు బాధ లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినందుకు సంతోషంగా ఉందన్నారు.

అయిదెండ్లు ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ రైతులకు చేసిందేమీ లేదని విమర్శించారు. నాడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటుపరం చేసినపుడు కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కాదా? రాష్ట్రంలో ఉన్నది మీ మిత్ర పక్షం టీడీపీ కాదా? అని ప్రశ్నించారు. పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆ బోర్డు విధివిధానాలు ఏంటి? బోర్డులో ఉన్న పాలక వర్గం ఎవరు? వీటన్నిటికీ సమాధానం చెప్పకుండా పసుపు బోర్డు తెచ్చి పసుపుకు ముప్పై వేల ధర ఇస్తున్నామని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

Also Read: ప్రణీత్‌రావు ఎవరో తెలియదు.. పార్టీ మారే ఉద్దేశం లేదు: ఎర్రబెల్లి దయాకర్ రావు