‘నేనన్నమాట తప్పేం లేదు.. కవిత సభ్యత్వం రద్దు చేయాలె..’ మండలి చైర్మన్ కు తీన్మార్ మల్లన్న కంప్లెయింట్..
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నసోమవారం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిశారు.

MLC Teenmar Mallanna
MLC Teenmar Mallanna: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్ కుమార్) సోమవారం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిశారు. తనపై దాడితోపాటు, అత్యాయత్నం చేశారంటూ ఎమ్మెల్సీ కవితపై మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. కవితపై చర్యలు తీసుకోవాలని, ఆమె ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
కంచం పొత్తు, మంచం పొత్తు అనేది తెలంగాణలో వాడుకునే సాధారణ సామెత. బీసీల భాషలో వియ్యం పొత్తు. బెంజ్ కార్లలో తిరిగే వాళ్లకు బీసీ సంస్కృతి ఏంది.. బీసీల కట్టుబాట్లు ఏంది అనేది తెలియదు. తెలుగులో వ్యాకరణంపై భాషపై నాకు పట్టు ఉంది. ఏ పదాలు వాడాలి.. ఏ పదం వాడకూడదు అనేది నాకు తెలుసు. నేను మాట్లాడి భాష కరెక్టేనా అని తెలియకుంటే.. కవిత వెళ్లి వాళ్ల నాన్నను అడగాలి. కానీ, వాళ్ల నాన్నతో మాటలు లేవుకాబట్టి ఆ కోపాన్ని బీసీలపై వెళ్లదీస్తున్నారని మల్లన్న అన్నారు. బీసీల రాజకీయ పార్టీని నిలువరించాలనే ఉద్దేశంతోనే తనపై దాడి జరిగిందన్నారు. నిన్నటి ఘటనకు సంబంధించి నాపై హత్యాయత్నంపై మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేశానని చెప్పారు.
ఇదిలాఉంటే.. ఎమ్మెల్సీ కవిత ఆదివారం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిశారు. తనపై అసభ్య పదజాలంతో దూషించారని ఎమ్మెల్సీ మల్లన్నపై ఫిర్యాదు చేశారు. ఆయనపై యాక్షన్ కి ఎథిక్స్ కమిటీ రిఫర్ చేయాలని కవిత కోరారు.
మేడిపల్లిలోని తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు ఆదివారం దాడి చేసిన విషయం తెలిసిందే. ఆఫీస్ లో ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. ఆ సమయంలో తీన్మార్ మల్లన్న కార్యాలయంలోనే ఉన్నారు. ఆందోళన కారులను అడ్డుకునే ప్రయత్నంలో మల్లన్న గన్‌మెన్ గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. కవిత చేపట్టిన బీసీ ఉద్యమాన్ని తప్పుబడుతూ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ జాగృతి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.