Rain Alert : తెలంగాణలో మూడ్రోజులు వానలేవానలు.. ఈ నాలుగు జిల్లాలకు రెడ్ అలెర్ట్.. కీలక హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ
Cyclone Montas తెలంగాణలో సోమవారం పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండగా.. మంగళ, బుధవారాల్లో పలు జిల్లాల్లో అతిభారీ వర్షాలు
Cyclone Montas
Rain Alert : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం సోమవారం తుపానుగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ ) తెలిపింది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారి, అదేరోజు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేసింది. మంగళవారం దాదాపు 12 గంటలపాటు తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని, ఆ తరువాత బలహీన పడుతుందని వాతావరణ శాఖ విభాగం అంచనా వేస్తోంది. అయితే, ఈ తుపాను ప్రభావం ఏపీలోనే కాకుండా తెలంగాణలోని జిల్లాలపైనా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో సోమవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మూడు రోజులు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
సోమవారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉండగా.. మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో పలు జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే చాన్స్ ఉంది. ఐదు సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
మంగళవారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, హనుమకొండతోపాటు మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
బుధవారం అదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగుతోపాటు మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉంది. ఆ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
