ముహూర్తం ఖరారు…ధరణి పోర్టల్ ప్రారంభోత్సవం

portal
Dharani portal launch : తెలంగాణలో ఆస్తుల వివరాల సేకరణ క్లైమాక్స్‌కు చేరింది. నమోదు ప్రక్రియ పూర్తి చేసిన ప్రభుత్వం..ధరణి పోర్టల్ ద్వారా రెవెన్యూ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. 2020, అక్టోబర్ 29వ తేదీ గురువారం 12.30 గంటలకు రంగారెడ్డి జిల్లా మూడు చింతలపల్లిలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ధరణి పోర్టల్ ప్రారంభం కానుంది.
తెలంగాణలో గురువారం నుంచి ధరణి పోర్టల్ ద్వారా భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. రెవెన్యూ శాఖను సమూలంగా ప్రక్షాలించాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్.. కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు. భూ సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం చూపించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా… రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్థిరాస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం భావించింది. అగ్రికల్చర్.. నాన్ అగ్రికల్చర్‌లుగా విభజిం నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది.
ఆస్తుల వివరాల నమోదు ప్రక్రియను అక్టోబర్ 15లోపు పూర్తి చేసి.. దసరా రోజున పోర్టల్‌ను ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది. అయితే.. వర్షాలు, వరదల కారణంగా.. నమోదు ప్రక్రియకు ఆటంకం కలిగింది. ఇక గ్రామీణ ప్రాంతాలో ఇళ్ల వివరాల నమోదు ప్రక్రియ వేగంగా జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. రూరల్ ఏరియాల్లో ఆస్తుల వివరాలు సేకరించే బాధ్యతను పంచాయతీ కార్యదర్శలకు అప్పగించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మున్సిపల్ అధికారులు వివరాలు నమోదు చేశారు.
ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణలో 62.68 లక్షల ఇళ్లున్నాయి. అందులో సోమవారం నాటికి 58.40 లక్షల ఇళ్లకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేశారు. వరదల కారణంగా హైదరాబాద్‌లో ఆ ప్రక్రియ నెమ్మదిగా సాగింది. అగ్రికల్చర్ భూములకు సంబంధించి సమాచారం ఆన్‌లైన్‌లో ఉంది. పోర్టల్ ప్రారంభమైన తర్వాత కూడా నమోదు ప్రక్రియ కొనసాగనుంది. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన ఇళ్ల వివరాలను అధికారులు ధరణి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయనున్నారు.
కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తున్నందున.. సెప్టెంబర్ 8 నుంచి తెలంగాణలో భూముల క్రయవిక్రయాలను రాష్ట్రప్రభుత్వం నిలిపివేసింది. అవన్నీ గురువారం నుంచి మళ్లీ మొదలవుతాయి. ఇప్పటికే తహసీల్దార్లకు శిక్షణ ఇచ్చారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్లను ట్రయల్స్ చేశారు. ధరణి పోర్టల్ అమలులోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో వ్యవసాయ భూమలు, ఇళ్ల భూముల సహా అన్ని రకాల రిజిస్ట్రేషన్లు దీని ద్వారానే జరుగుతాయని సీఎం కేసీఆర్ గతంలోనే స్పష్టం చేశారు.