బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూల్చివేతకు సిద్ధమవుతున్న అధికారులు..

ముందస్తు అనుమతి లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుని కూల్చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పలుమార్లు మున్సిపల్ అధికారులను ఆదేశించిన నేపథ్యంలో..

బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూల్చివేతకు సిద్ధమవుతున్న అధికారులు..

Updated On : September 19, 2024 / 5:29 PM IST

Brs Party Office Demolition : బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. 15 రోజుల్లో నల్గొండ జిల్లా పార్టీ ఆఫీసుని కూల్చేయాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది కోర్టు. తమ పార్టీ ఆఫీసుని కూల్చివేయకుండా రెగ్యులరైజేషన్ కు అనుమతించాలని బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.

Also Read : క్యాబినెట్‌ విస్తరణలో చోటు దక్కేదెవరికి, సీఎం రేవంత్‌ పరిశీలనలో ఉన్న పేర్లేవి..?

ముందస్తు అనుమతి లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుని కూల్చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పలుమార్లు మున్సిపల్ అధికారులను ఆదేశించిన నేపథ్యంలో.. బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే, కోర్టులో బీఆర్ఎస్ కు చుక్కెదురైంది. హైకోర్టు ఆదేశాలతో బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

నల్గొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఆఫీస్ ఉంది. దీన్ని 15 రోజుల్లో కూల్చివేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో బీఆర్ఎస్ శ్రేణులు షాక్ కి గురయ్యాయి. టౌన్ లోనే ప్రైమ్ లొకేషన్ లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఉంది. ఇక్కడ భూములకు విలువ ఎక్కువ. గజం లక్షన్నర ధర పలుకుతుంది. ఒక ఎకరం ప్లేస్ ని బీఆర్ఎస్ కి లీజుకిచ్చారు. దాదాపు 4800 గజాలు. అంటే 72 కోట్లు ఖరీదు చేస్తుంది. అంతటి విలువైన ప్లేస్ ఇది. చుట్టూ ఇళ్లు ఉంటాయి. రెసిడెన్షియల్ కాలనీలు ఉన్నాయి. ఇటువంటి చోట ఒక పార్టీ ఆఫీసు నిర్మాణానికి ఇవ్వడంపై మొదటి నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. నివాసాల మధ్య పార్టీ ఆఫీసుకు స్థలం కేటాయించడాన్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యతిరేకించారు.

అయితే అధికారికంగా ఈ భవనం ఇంకా ఓపెనింగ్ కాలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండలో గెలవడం, ఆర్ అండ్ బీ శాఖకు మంత్రి కావడంతో ఆయన ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుపై దృష్టి పెట్టారు. బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన అనుమతుల గురించి ఆయన ఆరా తీశారు. అయితే, ఎటువంటి అనుమతి లేకుండానే పార్టీ ఆఫీసు నిర్మించారని తెలుసుకున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుని కూల్చేయాలని మంత్రి కోమటిరెడ్డి అధికారులు ఆదేశించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఊరట పొందేందుకు హైకోర్టును ఆశ్రయించింది. అయితే, హైకోర్టులో బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగిలింది. కాగా, హైకోర్టు ఆదేశాలపై అప్పీల్ చేసే యోచనలో బీఆర్ఎస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంకా పార్టీ ఆఫీసు ఓపెనింగ్ కూడా కాలేదు. ఇంతలోనే కూల్చివేయాలంటూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.