క్యాబినెట్‌ విస్తరణలో చోటు దక్కేదెవరికి, సీఎం రేవంత్‌ పరిశీలనలో ఉన్న పేర్లేవి..?

మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ కసరత్తు ముమ్మరం చేసింది. పీసీసీ చీఫ్‌ను నియమించిన ఢిల్లీ నాయకత్వం ఇప్పుడు మంత్రి పదవుల ఆశావహుల లిస్టు బయటకి తీసినట్లు ప్రచారం జరుగుతోంది.

క్యాబినెట్‌ విస్తరణలో చోటు దక్కేదెవరికి, సీఎం రేవంత్‌ పరిశీలనలో ఉన్న పేర్లేవి..?

Updated On : September 19, 2024 / 4:17 PM IST

Gossip Garage : తెలంగాణ క్యాబినెట్‌ విస్తరణపై జరుగుతున్న కసరత్తు ఆశావహుల్లో ఆశలు పెంచేస్తోంది. మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉండగా, డజనుకు పైగానే నేతలు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా సామాజిక, ప్రాంతీయ సమీకరణాలతో నేతలు ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరికి సీనియర్లు మద్దతు ప్రకటిస్తుండటం వల్ల క్యాబినెట్‌ పోటీ రసవత్తరంగా మారుతోంది. నేడో రేపో అంటున్న తెలంగాణ క్యాబినెట్‌ విస్తరణలో చోటు దక్కేదెవరికి? సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలనలో ఉన్న పేర్లేవి? అధిష్టానం వద్ద క్యూ కట్టిన నేతలు ఎవరు?

మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని జిల్లాలకు అవకాశం?
తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ కసరత్తు ముమ్మరం చేసింది. పీసీసీ చీఫ్‌ను నియమించిన ఢిల్లీ నాయకత్వం ఇప్పుడు మంత్రి పదవుల ఆశావహుల లిస్టు బయటకి తీసినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పలువురు సీనియర్‌ ఎమ్మెల్యేలు పార్టీలో తమ వెల్‌విషర్స్‌తో అధిష్టానం దృష్టిని ఆకర్షించేలా తమ ప్రయత్నాలకు పదును పెడుతున్నారు. ముఖ్యంగా సామాజిక సమీకరణాలను పరిశీలిస్తున్న కాంగ్రెస్‌ హైకమాండ్‌.. ఉమ్మడి జిల్లాల వారీగా ప్రాతినిధ్యం లేని జిల్లాలకు అవకాశమివ్వాలని భావిస్తోందని చెబుతున్నారు. దీంతో నేతలంతా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఒకరికి ఛాన్స్..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఒకరికి కచ్చితంగా ఛాన్స్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ జిల్లా నుంచి సీనియర్‌ నేత, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌ సాగర్ రావు, చెన్నూర్‌ ఎమ్మెల్యే గడ్డం వివేక్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రేమ్‌సాగర్‌రావుకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు మద్దతుగా నిలుస్తున్నారు. భట్టి పాదయాత్ర విజయవంతం అయ్యేలా ప్రేమ్‌సాగర్‌రావు అండగా నిలిచారు. అదే సమయంలో పార్టీ కష్టకాలంలో ఉండగా, ఉమ్మడి జిల్లా బాధ్యతలను తీసుకోవడం ప్రేమ్‌సాగర్‌రావుకి కలిసొస్తుందంటున్నారు. ఇక గడ్డం వివేక్‌కు పార్టీలో చేరిన సమయంలో మంత్రి పదవిపై అధిష్టానం హామీ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఐతే ఆయన సామాజిక సమీకరణాలు కలిసొస్తాయా? లేదా? అనేది చూడాల్సివుంది.

మదన్ మోహన్ రావుకి రాహుల్ తో సన్నిహిత సంబంధాలు..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కూడా క్యాబినెట్‌ బెర్త్‌ కోరుకుంటున్నారు. సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి ఆఖరి చాన్స్‌ అంటూ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. సుదర్శన్ రెడ్డిపై సీఎం రేవంత్ కూడా సానుకూలంగా ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ఇక మదన్ మోహన్ రావుకి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు మదన్‌మోహన్‌. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ నుంచి ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉండగా, అదనంగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలు నాయక్ తమ పేర్లు పరిశీలించాలని అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు.

ప్రధాన సామాజికవర్గమైన ముదిరాజ్‌ల నుంచి ఒకరికి మంత్రి పదవి..
ఇక రాష్ట్రంలో ప్రధాన సామాజికవర్గమైన ముదిరాజ్‌ల నుంచి ఒకరికి మంత్రి పదవి ఇస్తామని గతంలో సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్, మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన నీలం మధు ముదిరాజ్ పోటీ పడుతున్నారు. నీలం మధు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి పాజిటివ్‌గా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక మరో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా మంత్రి వర్గంలో ఛాన్స్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆది శ్రీనివాస్ మున్నూరు కాపు సామాజికవర్గం కావడం.. తెలంగాణలో బలమైన బీసీ సామాజికవర్గం కావడంతో.. మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు.

ఆ ముగ్గురు ఉద్దండులను ఎదుర్కోవాలంటే రోహిత్‌కు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్‌..
ఇక మెదక్ ఎమ్మెల్యే.. అతి చిన్న వయస్సు ఉన్న మైనంపల్లి రోహిత్ రావు పేరుపైనా చర్చ జరుగుతోంది. మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, బీజేపీ నేత మెదక్ ఎంపీ రఘునందన్ రావు వంటి ఉద్దండులను ఎదుర్కోవాలంటే అదే సామాజికవర్గానికి చెందిన రోహిత్‌కు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్‌ వినిపిస్తోంది. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బడా నేతలను తట్టుకోవాలంటే రోహిత్‌ను మంత్రి చేయాలనే టాక్‌ నడుస్తోంది.

Also Read : బీఆర్ఎస్‌కు షాక్.. పార్టీ ఆఫీస్ కూల్చేయాలని హైకోర్టు ఆదేశం..

ఆరు ఖాళీలు.. నాలుగే భర్తీ..!
సో.. మొత్తం మీద ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రివర్గ విస్తరణ హాట్ టాపిక్ గా మారింది. ఉన్న ఆరు పదవుల కోసం దాదాపు డజను నేతలు పోటీ పడుతున్నారు. కానీ పార్టీ అధిష్టానం మాత్రం.. ఇప్పుడున్న ఆరులో నాలుగు మాత్రమే భర్తీ చేయాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో మంత్రి యోగం పట్టేదెవరికో అన్నది ఉత్కంఠ రేపుతోంది.