బీఆర్ఎస్‌కు షాక్.. పార్టీ ఆఫీస్ కూల్చేయాలని హైకోర్టు ఆదేశం..

బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని వెంటనే కూల్చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మున్సిపల్ అధికారులను గతంలో పలుమార్లు ఆదేశించారు.

బీఆర్ఎస్‌కు షాక్.. పార్టీ ఆఫీస్ కూల్చేయాలని హైకోర్టు ఆదేశం..

Updated On : September 18, 2024 / 7:59 PM IST

Shock For Brs : తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ పార్టీకి చుక్కెదురైంది. నల్గొండలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను 15 రోజుల్లో కూల్చివేయాలని మున్సిపల్ అధికారులను హైకోర్టు ఆదేశించింది. నల్గొండలో నిర్మించిన పార్టీ ఆఫీసును రెగులర్ చేసే విధంగా మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ఆఫీస్ నిర్మాణం చేపట్టకముందు అనుమతులు తీసుకోవాలని సూచించింది. పార్టీ ఆఫీస్ నిర్మాణం చేపట్టిన తర్వాత అనుమతి ఎలా ఇస్తారని ప్రశ్నించింది. అంతేకాకుండా అనుమతి లేకుండా పార్టీ ఆఫీస్ నిర్మాణం చేపట్టిన బీఆర్ఎస్ కు.. లక్ష రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Also Read : హిందూ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు.. “జానీ మాస్టర్”ది లవ్ జిహాద్ కేసు: బీజేపీ

బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని వెంటనే కూల్చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మున్సిపల్ అధికారులను గతంలో పలుమార్లు ఆదేశించారు. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించారు. తాజాగా కోర్టు ఆదేశాలతో బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు ఆదేశాలతో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కూల్చివేతకు మున్సిపల్ అధికారులు సిద్ధమవుతున్నారు.

నల్లొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ తన కార్యాలయాన్ని నిర్మించింది. దీన్ని కూల్చేయాలని ఇవాళ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం సంచలనంగా మారింది. కోర్టు ఆదేశాలతో బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యాయి. ప్రజలు నివసించే ఏరియా మధ్యలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ని నిర్మించారు. ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించాల్సిన ప్లేస్ ను రాజకీయ సంబంధ కార్యక్రమాల కోసం ఉపయోగించడం కరెక్ట్ కాదన్నారు మంత్రి కోమటిరెడ్డి. ఎలాంటి అనుమతులు తీసుకోనందున బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుని కూల్చేయాలని పలుమార్లు మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి. బహిరంగ మీటింగ్ లలో రెండుసార్లు మున్సిపల్ అధికారులను, కమిషనర్ ను ఆయన ఆదేశించారు.

ఒకవేళ సామాన్యుడు ఎవరైనా ఇదే విధంగా అనుమతులు తీసుకోకుండా ఇంతటి భారీ బిల్డింగ్ కడితే మీరు ఊరుకుంటారా? అని మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు మంత్రి కోమటిరెడ్డి. తమ పార్టీ ఆఫీసుని ఎక్కడ కూల్చేస్తారోనని బీఆర్ఎస్ శ్రేణులు కోర్టుని ఆశ్రయించాయి. ఆఫీసును రెగులరైజ్ చేసేలా మున్సిపల్ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. వెంటనే పార్టీ ఆఫీసుని కూల్చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అంతేకాదు లక్ష రూపాయలు ఫైన్ కూడా వేసింది.